‘మాకేం భయం లేదు.. మా ఏటీఎంలు ఫుల్లు’
శ్రీనగర్: దేశమంతా పెద్ద నోట్ల రద్దుతో ఒక్కసారిగా ప్రజానీకమంతా భయందోళనకు, కంగారులోకి వెళ్లిపోగా కశ్మీర్లో ప్రజలు మాత్రం అదేం లేదన్నట్లు ఉన్నారు. పైగా ఈ సంస్కరణను వారు స్వాగతిస్తున్నారు. ‘సాధారణ పౌరుడు ఎవరూ కూడా పెద్ద మొత్తంలో డబ్బును ఇంట్లో ఉంచుకోడు. ఎందుకంటే మా ప్రాంతమంతా సమస్యల మధ్య ఉండే ప్రాంతం. ఉన్న డబ్బంతా బ్యాంకుల్లోనే ఉంచుకుంటాం’ అని కశ్మీర్ యూనివర్సిటీలో ఆర్థికశాస్త్రం బోధిస్తున్న ఎలిజబెత్ మార్యాం తెలిపారు.
‘నెలనెలా జీతభత్యాలు అందుకునేవారు బ్యాంకు ఖాతాల ద్వారా తీసుకుంటారు. నిత్యావసరాలకు తగినంత మాత్రమే ఉపయోగించుకుంటారు. ఇక నైపుణ్యం ఉన్న కార్మికులు, శ్రామికులు మాత్రం వారు ఎంత ఖర్చుపెట్టుకోగలరో అంతమాత్రమే ఇక్కడ సంపాదించుకోగలరు. ఇక బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపార వేత్తలు ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు నిల్వలు ఉంచుకోరు. ఎందుకంటే ఇదంతా ఉద్రిక్తల నడుమ ఉండే ప్రాంతం కనుక. పెద్ద నోట్ల రద్దు ప్రభావం కశ్మీర్ పై తక్కువ ప్రభావాన్ని చూపేందుకు ఇదే ప్రధానమైన కారణం కూడా’ అని ఆమె అన్నారు.
ఇక నజీర్ ఖాజీ అనే జమ్మూ కశ్మీర్ బ్యాంకు అధికారి మాట్లాడుతూ తమ దగ్గర ఏటీఎంలన్నీ కూడా పూర్తిగా నింపేసి ఉంచామని, ఎక్కడా కూడా పెద్ద రద్దీ లేదని, బ్యాంకుల వద్దకు మాత్రం డబ్బును మార్పిడి చేసుకునేందుకు వస్తున్నారని చెప్పారు. అయితే, అంత ఇబ్బంది పడేంత పరిస్థితి మాత్రం తమ వద్ద లేదని వెల్లడించారు.