ముంబయి: ప్రధాని నరేంద్రమోదీపై శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నిప్పులు చెరిగారు. పెద్ద నోట్లు రద్దు నిర్ణయాన్ని హిరోషిమా నాగాసాకిలపై వేసిన అణుబాంబులతో పోల్చారు. పెద్ద నోట్ల రద్దు అనే అణుబాంబుతో మోదీ భారత ఆర్థిక వ్యవస్థను హిరోషిమా, నాగసాకి స్థాయికి తగ్గించారని ఆరోపించారు.
'అందరూ బలయ్యారు' ఈ నిర్ణయం ద్వారా ప్రధాని మోదీ ఏ ఒక్కరినీ విడిచిపెట్టలేదు అంటూ ఉద్ధవ్ బుధవారం తమ అధికారిక పత్రికలు 'సామ్నా, దోపహార్ కా సామ్నా'లో ఆరోపించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకునే సమయంలో రిజర్వ్ బ్యాకు ఆఫ్ ఇండియా చెప్పినా వినలేదని మండిపడ్డారు. 'చెవిటి, మూగ రామచిలుకల్లా కేబినెట్‌లో కూర్చుని ఉర్జిత్ పటేల్‌ను ఆర్బీఐ గవర్నర్‌గా నియమించారు. దేశ ఆర్థికవ్యవస్థ అమాంతం పడిపోయింది' అంటూ ఆయన అందులో ఆరోపించారు.