
30 తర్వాతా విత్‌డ్రాపై ఆంక్షలు
• డిమాండ్‌కు తగ్గ నగదు లేకపోవడమే కారణం!
• నగదు లభ్యత మెరుగుపడితేనే ఆంక్షల సడలింపు
న్యూఢిల్లీ: బ్యాంకుల నుంచి నగదు విత్‌డ్రాపై ఆంక్షలు.. పెద్దనోట్ల రద్దు ప్రక్రియకు విధించిన డిసెంబర్ 30 గడువు తర్వాత కూడా కొనసాగే అవకాశముంది. కరెన్సీ ప్రెస్సులు, రిజర్వు బ్యాంకు.. డిమాండ్‌కు తగిన మొత్తంలో కొత్త కరెన్సీని అందించలేకపోతుండడమే దీనికి కారణం. ప్రస్తుతం ఏటీఎం, బ్యాంకుల నుంచి వారానికి రూ. 24 వేలు, రోజుకు రూ. 2,500 విత్‌డ్రా చేసుకునే అవకాశమున్నా.. బ్యాంకులు నగదు కొరత వల్ల ఆ మొత్తాన్ని ఖాతాదారులకు అందించలేకపోతున్నాయి. నగదు లభ్యతను బట్టి కొంత మొత్తాన్ని మాత్రమే అందిస్తున్నాయి. నోట్ల రద్దుకు నిర్దేశించిన 50 రోజుల గడువు దగ్గరపడుతు న్నా పరిస్థితిలో మార్పు రావడం లేదు. ఈ నేపథ్యంలో కొత్త ఏడాదిలోనూ విత్‌డ్రాపై ఆంక్షలు కొనసాగొచ్చని బ్యాంకర్లు చెబుతున్నారు.
‘విత్‌డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తేస్తారని మాలో చాలామంది అనుకోవడం లేదు. నగదు లభ్యత మెరుగుపడితే మాత్రం ఆంక్షలను సడలించే అవకాశం ఉంది’ అని ఓ ప్రభుత్వ రంగ బ్యాంకు సీనియర్ అధికారి చెప్పారు. ఆంక్షలను ఒక్కసారిగా ఎత్తివేయకపోవచ్చని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు కూడా పేర్కొంటున్నాయి. బ్యాంకులకు మరింత నగదు అందనంత వరకు ఆంక్షలు ఉంటాయని ఎస్‌బీఐ చైర్‌పర్సన్ అరుంధతీ భట్టాచార్య కూడా సూచన ప్రాయంగా చెప్పారు. విత్‌డ్రాపై ఆంక్షలు ఎప్పుడు తొలగిస్తారో ఆర్‌బీఐ, ప్రభుత్వం కూడా చెప్పకపోవడం గమనార్హం. డిసెంబర్ 30 తర్వాత విత్‌డ్రా పరిమితిపై సమీక్ష ఉంటుందని ఆర్థిక శాఖ కార్యదర్శి అశోక్ లావాసా చెప్పారు. చలామణిలో ఉండిన రూ. 15.4 లక్షల కోట్ల రూ. 500, రూ.1,000 నోట్లకు గాను నవంబర్ 8– డిసెంబర్ 19 మధ్య కాలంలో రిజర్వు బ్యాంకు రూ. 5.92 లక్షల కోట్ల కరెన్సీని విడుదల చేసింది. డిసెంబర్ 10 వరకు రూ. 12.4 లక్షల కోట్ల విలువైన రద్దయిన నోట్లు బ్యాంకులకు చేరాయి.