మేనకోడలి మృతదేహంతో 10 కి.మీ..
కౌశాంబి :
ఉత్తర్ ప్రదేశ్లో ఓ హృదయవిధారక సంఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రిలో అంబులెన్స్లు ఉన్నా డబ్బులేనిదే పనిజరగదని మొరాయించాయి. దీంతో కొండంత దుఃఖాన్ని దిగమింగి ఏడు నెలల మేనకోడలి మృతదేహాన్ని తన భుజాలపైనే మోసుకెళ్లాడో అభాగ్యుడు. చిన్నారిని ఓ చేత్తో మరో చేత్తో సైకిల్ హ్యాండిల్ పట్టుకొని 10 కిలో మీటర్లు ప్రయాణించాడు.
వివరాలు.. ఉత్తర్ ప్రదేశ్లోని మజ్హన్పూర్లో మలాక్ సద్దీ గ్రామానికి చెందిన 7 నెలల చిన్నారి పూనమ్కు వాంతులు, విరేచనాలు ఎక్కువగా అవ్వడంతో జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఖర్చుల కోసం డబ్బు సమకూర్చడానికి రోజూవారి కూలిగా పనిచేసే పూనమ్ తండ్రి అనంత్ కుమార్ అలహాబాద్ వెళ్లాడు. అదే సమయంలో చిన్నారిని చూసుకోవాల్సిందిగా బావమరిది బ్రిజ్ మోహన్కు అనంత్ చెప్పి బయలుదేరాడు.
అయితే రెండు రోజుల చికిత్స అనంతరం పూనమ్ మృతిచెందింది. దీంతో చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ సమకూర్చాలని ఆసుపత్రి వర్గాలను బతిమిలాడాడు బ్రిజ్ మోహన్. వారు నిరాకరించడంతో చేసేదేమీలేక చివరకు ఓ సైకిల్ను అద్దెకి తీసుకొని చిన్నారి మృతదేహాన్ని గ్రామానికి తీసుకు వెళ్లాడు. భుజంపైనే మేనకోడలి మృతదేహాన్ని పెట్టుకొని సైకిల్ పై గ్రామానికి చేరుకున్నాడు.
'నేను అంబులెన్స్ డ్రైవర్కు చాలా సార్లు ఫోన్ చేశాను. కానీ, నా మేనకోడలి మృతదేహాన్ని గ్రామానికి తీసుకువెళ్లడానికి అతను నిరాకరించాడు. చివరకు దిక్కుతోచని పరిస్థితుల్లో సైకిల్ మీదే నా కోడలిని తీసుకువెళ్లాను'అని బ్రిజ్ మోహన్ చెప్పాడు.
ఈ సంఘటనపై విచారణకు ఆదేశించినట్టు చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఎస్ కే ఉపాధ్యాయ్ తెలిపారు. డ్రైవర్తో పాటూ ఆ సమయంలో డ్యూటీలో ఉన్న డాక్టర్పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిచారు. కాగా, డీజిల్కు డబ్బులేక పోవడం వల్లే అంబులెన్స్ను సమకూర్చలేకపోయామని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.