సాక్షి, హైదరాబాద్: మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఊబకాయం, అశాస్త్రీయ వ్యాయామం అన్నీ కలిపి ఇరవై ఐదేళ్లకే కీళ్లు అరిగిపోతున్నాయి. యాభైల్లో వచ్చే కీళ్ల అరుగుదల ఇప్పుడు యుక్త వయసులోనే కనిపిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కీళ్ల నొప్పుల పేరుతో వచ్చే కేసుల్లో 20 శాతానికిపైగా అరుగుదల సమస్యతో బాధపడేవారే ఎక్కువగా ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. మనిషి ఎంతో ఫిట్‌గా ఉన్నా కీళ్ల అరుగుదల పట్టి పీడిస్తుంది. దేశంలో తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిస్థితి అధికంగా కనిపిస్తోందని చెబుతున్నారు.
క్రీడలు, అధిక వ్యాయామం, జాగింగ్, అశాస్త్రీయ యోగా తదితరాల పట్ల ఆసక్తి కనిపించే ఇక్కడి వారిలో కీళ్ల అరుగుదల సర్వసాధారణమైందని అంటున్నారు. ఒక అంచనా ప్రకారం తెలంగాణలో ఏడాదికి దాదాపు 35 వేల కీళ్ల అరుగుదల కేసులు ఆసుపత్రులకు వస్తున్నాయి. నేడు ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కీళ్ల వ్యాధిపై యశోద ఆసుపత్రి చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ టి.దశరథరామారెడ్డి సహకారంతో ‘సాక్షి ’ప్రత్యేక కథనం.
అశాస్త్రీయ యోగా... ట్రెడ్‌మిల్‌పై జాగింగ్
రుమటాయిడ్, ఇన్‌ఫ్లమేటరీ, సోరియాటిక్, ఆస్టియో, సెకండరీ అని వివిధ రకాల ఆర్థరైటిస్‌లున్నాయి. ఇవన్నీ వివిధ కారణాల వల్ల వస్తుంటాయి. ఆర్థరైటిస్ అంటే కీళ్ల అరుగుదల అని అర్థం. సెకండరీ ఆర్థరైటిస్ చిన్నప్పుడు తగిలిన దెబ్బల వల్ల, జాయింట్‌లో ఎముకలు విరిగి వంకరగా అతుక్కుపోవడం వల్ల కూడా వస్తుంటుంది. కీళ్లను పట్టిఉంచే లిగమెంట్‌కు గాయమైనప్పుడు, జాయింట్ బాలెన్స్ తప్పినప్పుడు కీలు అరిగిపోతుంది. అంతేకాక ట్రెడ్‌మిల్‌పై జాగింగ్, వాకింగ్ చేయడం, స్కిప్పింగ్ చేయడం, మెట్లు ఎక్కి దిగడం, ఇతరత్రా ఏరోబిక్ వ్యాయామాల వల్ల కూడా చాలామందికి కీళ్లు అరుగుతాయి. ఎముకలు వంకరగా అతుక్కోవడం వల్ల కూడా ఈ పరిస్థితి వస్తుంటుంది. చాలామంది కనీస శిక్షణ కూడా లేకుండా యోగా చేస్తుంటారు. దీనివల్ల కీళ్లు అరిగిపోతాయి.
అధిక వ్యాయామంతో ముప్పు..
అధిక వ్యాయామం కీళ్ల అరుగుదలకు దారితీస్తుంది. 45 నిముషాల కంటే ఎక్కువగా వాకింగ్ చేయవద్దు. సిమెంటు, తారు రోడ్లపై ఎట్టి పరిస్థితుల్లోనూ వాకింగ్, జాగింగ్, స్కిప్పింగ్ చేయవద్దు. దీనివల్ల ఫిట్‌నెస్ వస్తుంది కానీ కీళ్లు అరిగిపోతాయి. స్టెరాయిడ్స్ వాడకం వల్ల కూడా ఆర్థరైటిస్ వస్తుంటుంది. విటమిన్ ‘డి’లోపంతో ఆస్టియో ఫోరోసిస్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. సాధారణంగా జాయింట్‌లో కొంచెం నొప్పి లేదా మంట ఉంటే ఆర్థరైటిస్‌గా పరిగణించవచ్చు. మెట్లు ఎక్కి దిగేప్పుడు నొప్పి వస్తుంటుంది. పది అడుగులు కూడా వేయలేని పరిస్థితి ఉంటే దాన్ని తీవ్రమైన కీళ్ల నొప్పిగా చెప్పవచ్చు. ఊబకాయం, అతిగా క్రీడల్లో పాల్గొనడం వల్ల యువతలో ఆర్థరైటిస్ కనిపిస్తుంటుంది. పట్టుమని 25 ఏళ్లు కూడా నిండీ నిండకముందే యువతకు కీళ్ల అరుగుదల సమస్యగా మారడం ఆందోళన కలిగిస్తోంది.
తీవ్రంగా ఉంటే ఆపరేషన్..
సాధారణ, మధ్యస్థ స్థాయి కీళ్ల అరుగుదలకు ఫిజియో థెరపీ, బరువు తగ్గడంతో నయం చేయవచ్చు. నొప్పి మాత్రలు వేసుకుంటే చాలు. సాధారణానికి మించి కీళ్లు అరిగిపోతే లూబ్రికేటివ్ ఏజెంట్స్ (గుజ్జు)ను ఇంజక్షన్ లేదా మాత్రల రూపంలో ఇస్తారు. ఇక తీవ్రమైన ఆర్థరైటిస్‌కు ఆపరేషనే పరిష్కారం. ప్రస్తుతం కీళ్ల అరుగుదలపై చైతన్యం పెరిగింది. హైదరాబాద్‌లో రోజుకు 50 వరకు సంబంధిత ఆపరేషన్లు జరుగుతున్నాయి.
ఆపరేషన్‌పై అపోహలు వద్దు
ఆర్థరైటిస్‌కు చేయించుకునే ఆపరేషన్‌పై అనేక అపోహలు ఉన్నాయి. నడవలేరు, ఖరీదు ఎక్కువని ఆపరేషన్ చేశాక నొప్పి ఉంటుందని అనుకుంటారు. ఇది సరైన ధృక్పథం కాదు. ముందుగా ప్రాథమిక స్థాయిలో మందులు, సరైన వ్యాయామం, జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయినా తగ్గకపోతే చివరగా ఆపరేషన్ తప్పనిసరి. కీళ్ల అరుగుదల ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లోను మెట్లు ఎక్కకూడదు.
–డాక్టర్ టి.దశరథరామారెడ్డి, చీఫ్ ఆర్థోపెడిక్ సర్జన్, యశోద ఆసుపత్రి, సోమాజీగూడ, హైదరాబాద్
Comments
Please login to add a commentAdd a comment