యవ్వనంలోనూ...అరుగుతున్నాయ్ కీళ్లు
- నేడు వరల్డ్ ఆర్థరైటీస్ డే
- పాతికేళ్లకే కీళ్లనొప్పులు..
- గ్రేటర్‌లో పెరుగుతున్న ఆర్థరైటీస్ బాధితులు
- అధిక బరువు, పోషకాహార లోపమే కారణమంటున్న నిపుణులు
సాక్షి, సిటీబ్యూరో: కీళ్ల నొప్పులు ఒకప్పుడు ఆరుపదుల వయసు దాటిన వారిలోనే కన్పించేవి. కానీ మారిన జీవన స్థితిగతులు, తీసుకునే ఆహారం దృష్ట్యా ప్రస్తుతం అన్ని వయస్సుల వారిని వేధిస్తోంది. యువతే కాదు పిల్లలు సైతం కీళ్ల నొప్పులతో బాధపడుతుండడం బాధాకరం. బాధితుల్లో 70 శాతం మంది మహిళలు, 30 శాతం పురుషులు ఉంటున్నారు. 10-15 శాతం వరకు పిల్లలు కూడా ఉండటం ఆందోళనకరం. గత పదేళ్లతో పోలిస్తే ఈ సంఖ్య రోజు రోజుకు మరింత పెరుగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అధిక బరువు, మారిన ఆహారపు అలవాట్లు, పోషకాహారలోపం, పిల్స్‌వాడటమే ఇందుకు కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఆదివారం ‘వరల్డ్ ఆర్థరైటీస్ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం.
రుమటాయిడ్ ఆర్థరైటీస్ బాధితులే అధికం..
నగరంలో వివిధ రకాల కీళ్లనొప్పులతో బాధపడుతున్న వారిపై కిమ్స్ ఆస్పత్రి రుమాటాలజీ విభాగం ఇటీవల ఓ సర్వే నిర్వహించగా విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. గత ఐదేళ్లలో ఆస్పత్రికి వచ్చిన 10 వేల మందిపై పరిశోధన చేయగా, వీరిలో రుమటాయిడ్ ఆర్థరైటీస్ (కీళ్లనొప్పి)తో 29 శాతం, ఆస్టీయో ఆర్థరైటీస్(మోకాలు, మోచేతి కీళ్లలోని గుజ్జు అరిగిపోవడంతో వచ్చే నొప్పి)తో 17 శాతం, సొరియాటిక్ ఆర్థరైటీస్(చర్మం పొడుసుబారిపోవడం)తో 8 శాతం, లూపస్(ముఖంపై సీతాకొక చిలుకలా మచ్చలు ఏర్పడటం)తో 7 శాతం, ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్(వెన్నెముఖ, నడుం వంగిపోవడం)తో 4 శాతం, ఆస్టియో పోరోసిస్(ఎముకల్లో సాంద్రత తగ్గడం వల్ల అవి విరిగిపోవడం)తో 3 శాతం, గౌట్(రక్తంలో యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కాలిబొటన వేలిపై నొప్పి)తో మరో 3 శాతం మంది బాధపడుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని కిమ్స్ రుమటాలజీ విభాగాధిపతి డాక్టర్ శరత్‌చంద్రమౌలి వీరవల్లి వెల్లడించారు.
ఆర్థరైటీస్ మహిళల్లో హృద్రోగ సమస్యలు..
నగరంలోని ఆర్థరైటీస్‌తో బాధపడుతున్న 800 మంది వివరాలు సేకరించి, ఆరోగ్యంగా ఉన్న మరో 800 మందితో వయసు, లింగ, నిష్పత్తి, స్మోకింగ్ , నడుం చుట్టూ కొలత, హైపర్‌టెన్షన్, డయాబెటిస్ మెల్లటస్, బాడీ మాస్ ఇండెక్స్, బీపీ, షుగర్, ఆధారంగా అధ్యయనం చేయగా ఈ విషయం బయట పడిందని డాక్టర్ శరత్‌చంద్రమౌలి స్పష్టం చేశారు. 25-46 ఏళ్లలోపు వారిని ఎంపిక చేయగా వీరిలో 666 మంది మహిళలే. రుమటాయిడ్ ఆర్థరైటీస్ రోగులను సాధారణ ప్రజలతో పోలిస్తే వారిలో 2-3 శాతం కార్డియో వాస్క్యులర్ ప్రమాదం ఉన్నట్టు తేలింది.
వైట్ కాలర్ ఉద్యోగులే అధికం..
శరీరానికి కనీసం ఎండ కూడా తగలకుండా 24 గంటలు ఏసీల్లో కూర్చోని పని చేస్తున్న వారు ఆర్థరైటీస్ బారినపడుతున్నారు. ఇందులో ఐటీ, అనుబంధ రంగాల్లోని ఉద్యోగులతోపాటు ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, ఇతర వైట్ కాలర్ ఉద్యోగులు ఉన్నారు. అదీగాక కార్పొరేట్ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు సైతం కీళ్ల నొప్పుల బాధితులుగా మారుతున్నారు. బాధితుల్లో ఎక్కువ శాతం 40 ఏళ్లలోపు వారే ఉన్నారు. మహిళలు ఎక్కువగా లూపస్ సమస్యను ఎదుర్కొంటుంటే, పురుషులు ఎంకైలోజింగ్ స్పాండిలైటీస్‌తో బాధపడుతున్నారు.
- డాక్టర్ శరత్‌చంద్రమౌలి వీరవల్లి, చీఫ్ రుమాటాలజిస్ట్, కిమ్స్