
డేరా మేనేజర్ హత్యకేసు విచారణ 18నుంచి
పంచకుల: డేరా సచ్చా సౌధా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసులో రోజూవారీ విచారణ ఈనెల 18న సీబీఐ ప్రత్యేక కోర్టులో ప్రారంభం కానుంది. జర్నలిస్టు రామ్ చందర్ ఛత్రపతి, రంజిత్ సింగ్ హత్యా కేసుల విచారణను కోర్టు శనివారం చేప్టటింది. రెండు కేసులను వేర్వేరుగా విచారించాలని, ఛత్రపతి కేసు విచారణను మళ్లీ సెప్టెంబర్ 22న చేపడతామని తెలిపింది. డేరా ఆశ్రమంలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చినందుకు వీరిని 2002లో కిరాతకంగా హతమార్చారు.
ఈ రెండు కేసుల్లోనూ ప్రధాన కుట్రదారుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న డేరా సచ్చా సౌధా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ప్రధాన సాక్షిగా ఉన్న గుర్మీత్ డ్రైవర్ కట్టా సింగ్ మరోమారు తన వాంగూల్మాన్ని నమోదు చేసుకోవాల్సిందిగా కోర్టును కోరాడు. గుర్మీత్ అనుచరుల నుంచి బెదిరింపులు రావడంతో 2012లో తప్పుడు వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చిందని చెప్పాడు. కట్టాసింగ్ పిటిషన్ విచారణను కోర్టు సెప్టెంబర్ 22కు వాయిదా వేసింది.