డేరాలో మళ్లీ టెన్షన్...
సాక్షి, చండీగర్‌ః డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీం సింగ్‌పై రెండు వేర్వేరు హత్య కేసులపై శనివారం కీలక విచారణ సందర్భంగా హర్యానాలోని పంచ్‌కులలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. సిర్సాకు చెందిన జర్నలిస్ట్ రాం చందర్ ఛత్రపతి, మాజీ డేరా మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి జగ్దీప్ సింగ్ విచారణ చేపట్టనున్నారు. రెండు అత్యాచార కేసుల్లో ఇదే కోర్టు గతనెల 25న గుర్మీత్ సింగ్‌ను దోషిగా నిర్ధారించి శిక్ష విధించింది. మరోవైపు గుర్మీత్ సన్నిహితుడు దిలావర్ సింగ్ ఇన్సాన్‌ను హర్యానా పోలీసులు ఏడు రోజుల కస్టడీలోకి తీసుకున్నారు.
ఇక డేరా బాబాపై రెండు హత్య కేసులకు సంబంధించి విచారణ జరుగుతున్నక్రమంలో కోర్టు కాంప్లెక్స్ వద్ద, పంచ్‌కుల ఇతర ప్రాంతాల్లో పారా మిలటరీ బలగాలతో పాటు, హర్యానా పోలీసులను పెద్దసంఖ్యలో నియోగించామని డీజీపీ బీఎస్ సంధూ చెప్పారు. గత నెలలో అత్యాచార కేసుల విచారణ నేపథ్యంలో భారీ సంఖ్యలో డేరా మద్దతుదారులు పంచ్‌కులకు తరలివచ్చిన క్రమంలో ఈసారి అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. 2002లో ఛత్రపతి, రంజిత్ సింగ్‌లు హత్యకు గురయ్యారు. ఈ రెండు కేసుల్లో గుర్మీత్ సింగ్ నిందితుడు. డేరా బాబా సమక్షంలోనే ఈ రెండు హత్యలు జరిగినట్టు ఆరోపణలున్నాయి.