త్రిపుర, అమిత్ షా
అగర్తలా: ఈశాన్య రాష్ట్రాల్లో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న బీజేపీ.. ఈసారి త్రిపురలో అధికారం కోసం తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ రాష్ట్రం కోసం ‘కాంగ్రెస్ ముక్త భారత్’ విధానాన్ని మార్చుకుని.. ‘కమ్యూనిస్ట్ ముక్త త్రిపుర’ నినాదంతో దూసుకెళ్తోంది. 1972లో త్రిపుర ఏర్పాటైనప్పటినుంచి తొలిసారిగా ‘లెఫ్ట్–రైట్’ మధ్య పోటీ నెలకొందని ‘పీపుల్స్‌పల్స్’ సంస్థ జరిపిన సర్వేలో వెల్లడైంది.
ప్రతి ఊరూ వామ‘పక్ష’మే
దేశవ్యాప్తంగా కమ్యూనిస్టుల ప్రాభవం తగ్గుతున్నా వారికి కంచుకోటలా ఉన్న రాష్ట్రాల్లో త్రిపుర చాలా కీలకమైనది. చిన్న రాష్ట్రమైనా 4 దశాబ్దాలుగా (1988–92 దఫా మినహా) అధికారంలో ఉండటంతో ఇంటింటికీ వేళ్లూనుకుపోయిన పరిస్థితి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో వామపక్ష ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలదే పైచేయి. ‘ఎర్ర’కోటలో కమ్యూనిస్టులను ఎదుర్కొనేందుకు ఇన్నాళ్లుగా కాంగ్రెస్ చాలా ప్రయత్నించింది. త్రిపురలో రెండే వర్గాలుంటాయి. ఒకటి సీపీఎం అనుకూల వర్గం (దాదాపు 60%), రెండోది వ్యతిరేక వర్గం (మిగిలిన 40%).
సీపీఎంను దెబ్బతీస్తూ..
త్రిపురలో బెంగాలీల జనాభా ఎక్కువ. దీనికితోడు కొంతకాలంగా త్రిపురలో గిరిజన తెగల మధ్య (సీపీఎం అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య) ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. ఇన్నిసార్లు మద్దతిస్తున్నా కాంగ్రెస్‌కు అధికారం దక్కకపోవటంతో సీపీఎం వ్యతిరేక వర్గం ప్రత్యామ్నాయం కోసం ఎదురుచూసింది. ఈ నేపథ్యంలో అధికార వ్యతిరేక వర్గాన్ని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మూడేళ్ల క్రితమే ప్రయత్నాలు మొదలెట్టింది. 25 ఏళ్లుగా అధికారంలో ఉన్న సీపీఎంపై ప్రభుత్వ వ్యతిరేకతను, రాష్ట్రం వెనుకబాటుతనాన్ని ప్రచారాస్త్రాలుగా మలచుకుంది.
కమ్యూనిస్టులకు బలమైన అండగా నిలుస్తున్న కార్మిక, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు గాలం వేసేందుకు.. ‘అధికారంలోకి వస్తే ఏడో వేతనసవరణ అమలుచేస్తాం’ అని హామీ ఇచ్చింది. దీని ప్రభావం రాష్ట్రంలోని లక్షన్నర మంది ఉద్యోగులపై, వారి కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపవచ్చని పీపుల్స్ పల్స్ వెల్లడించింది. అటు, బెంగాలీలు, గిరిజనులను, ప్రభుత్వ అనుకూల వర్గాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఎన్నడూ లేనంతగా త్రిపురలో ప్రముఖులతో ప్రచారం నిర్వహిస్తూనే.. ఇంటింటికి చేరువవుతోంది. అయితే విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ బలమైన కమ్యూనిస్టు కోటను ఈ ఒక్క ప్రయత్నంలోనే దెబ్బకొట్టలేరని పీపుల్స్ పల్స్ తెలిపింది. ఈసారికి ప్రధాన ప్రతిపక్షం హోదా దక్కవచ్చని అభిప్రాయపడింది.
అధికారం మాదే
ఈ ఎన్నికల్లో త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా చెప్పారు. 20వ బీజేపీ పాలిత రాష్ట్రంగా త్రిపుర మారనుందని ఆయన అగర్తలాలో సోమవారం పేర్కొన్నారు. పార్టీ మేనిఫెస్టోను పూర్తిగా అమలుచేసి రాష్ట్రాభివృద్ధికి పాటుపడతామని ఓటర్లకు భరోసానిచ్చారు. మణిపూర్, అస్సాంలలోనూ గతంలో ఒక్కసీటు కూడా లేని పరిస్థితినుంచి ఏకంగా అధికారాన్ని అందుకున్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు.
Comments
Please login to add a commentAdd a comment