న్యూఢిల్లీ: మిడతల దండు పచ్చని పైర్లకు, చెట్లకు మాత్రమే ప్రమాదంగా పరిణమించగా వీటివల్ల విమానాలకూ ముప్పు వాటిల్లే అవకాశముందని డీజీసీఏ(వైమానిక నియంత్రణ సంస్థ) హెచ్చరించింది. విమానాలు ల్యాండింగ్, టేకాఫ్ అయ్యే సమయాల్లో ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. ఈ ఇబ్బందులను అధిగమించేందుకు అనుసరించాల్సిన పద్ధతులపై డీజీసీఏ శుక్రవారం పైలట్లకు, ఇంజనీర్లకు మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల్లో.. మిడతలు సాధారణంగా తక్కువ ఎత్తులోనే విహరిస్తాయని తెలిపింది. (రాకాసి పురుగుపై టోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు)
విమానం ల్యాండింగ్, టేకాఫ్ సమయాల్లో విమానంలోని ప్రవేశ మార్గాల(ఇంజిన్ ఇన్‌లెట్, ఎయిర్ కండిషనింగ్ ప్యాక్ ఇన్‌లెట్, తదితర మార్గాలు) ద్వారా మిడతల దండు లోనికే ప్రవేశించే అవకాశం ఉందని పేర్కొంది. తద్వారా విమానాలు ఎగురుతున్నప్పుడు ఆ ద్వారాలు పాక్షికంగా లేదా పూర్తిగా మూసుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. పిటోట్, స్టాటిక్ సోర్స్(గాలి ప్రవాహ వేగాన్ని కొలిచే సాధనాలు) మూసుకుపోవడం వల్ల గాలివేగం, అల్టీమీటర్ సూచీలు తప్పుడు సంకేతాలిస్తాయని తెలిపింది. కాగా ఖండాలను దాటుతూ పయనిస్తోన్న మిడతల దండు భారత్‌లో తొలిసారిగా రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. అనంతరం పంజాబ్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరిస్తూ విధ్వంసం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. (మిడతల దండుపై దండయాత్ర)
Comments
Please login to add a commentAdd a comment