
మళ్లీ షిర్డీ సాయి విగ్రహాల వివాదం!
అలహాబాద్: షిర్డీ సాయిబాబా విగ్రహాల వివాదం మళ్లీ మొదలైంది. షిర్డీ సాయి దేవుడు కాదని, హిందూ ఆలయాల నుంచి ఆయన విగ్రహాలను తొలగించాలని హిందూమత నాయకులు తీర్మానం చేశారు. మతపరమైన భావాలను దెబ్బతీసిన బాలీవుడ్ సినిమా పీకేను నిషేధించాలనీ డిమాండ్ చేశారు. అలహాబాద్‌లో ఆదివారం రాత్రి ముగిసిన ధర్మ సంసద్ సమ్మేళనంలో ఈమేరకు పలు తీర్మానాలు చేశారు.'షిర్డీ సాయిబాబా గురువూ కాదు, దేవుడూ కాదు. కనుక హిందూ ఆలయాలపై చెడు ప్రభావాలు పడకుండా వాటి నుంచి ఆయన విగ్రహాలను తొలగించాలి' అని తీర్మానంలో పేర్కొన్నారు. ద్వారక శంకరాచార్య శిబిరంలో ద్వారక శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి, పూరి శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి సమక్షంలో జరిగిన ఈ సమ్మేళనంలో వందలాది సాధువులు, మతనాయకులు పాల్గొన్నారు.
గోవధను నిషేధించాలని, హిందువులు ఇతర మతాల్లోకి మారకుండా చర్యలు తీసుకోవాలని, సంస్కృతాన్ని ప్రోత్సహించాలని తీర్మానాలు చేశారు. అయోధ్యలో సనాతన సంప్రదాయాల ప్రకారం రామాలయాన్ని నిర్మించాలని, ప్రభుత్వ పథకాలకు హిందీ పేర్లు పెట్టాలని కోరారు. హిందువుల జనాభా తగ్గకుండా ఉండేందుకు హిందూ ధర్మాన్ని శక్తిమంతగా ప్రచారం చేయాలని స్వరూపానంద సూచించారు.