పెట్రోల్ బంకుల్లో ‘డిజిటల్’ జోరు!
న్యూఢిల్లీ: నగదురహిత చెల్లింపులకు దేశవ్యాప్తంగా పెట్రోల్ బంక్‌లు సన్నద్ధమయ్యాయి. డెబిట్, క్రెడిట్ కార్డులే కాకుండా ఈ వాలెట్‌లు, మొబైల్ వాలెట్లలతో కార్యకలాపాలు జరిపేందుకు తగిన మౌలిక సదుపాయాలను ఏర్పాటుచేసుకున్నాయి. సుమారు 4,800 పెట్రోలు బంక్‌లు పీఓఎస్ యంత్రాల ద్వారా రోజూ కార్డుకు రూ.2 వేల చొప్పన నగదును ప్రజలకు అందిస్తున్నాయి. గత రెండు వారాల్లో ఇలా రూ.65 కోట్లు సరఫరా చేశాయి. నెల రోజుల పాటు సుమారు 53 వేల పెట్రోలు బంక్‌ల వద్ద డిజిటల్ చెల్లింపులపై నిర్వహించే అవగాహన కార్యక్రమాలను శనివారం ప్రారంభించినట్లు పెట్రోలియం మంత్రి ధర్మేంద ప్రధాన్ చెప్పారు. పెట్రోల్ బంక్‌ల వద్ద ఏర్పాటుచేసిన ప్రత్యేక కియోస్కోలు ఇంధనం కొనుగోలుకే కాకుండా ఎలక్ట్రానిక్ చెల్లింపులకూ పనిచేస్తాయి. త్వరలో ఇది ఎల్పీజీ పంపిణీ సంస్థలు, సీఎన్‌జీ బంకుల్లో అమల్లోకి వస్తుంది. ఇప్పటికే ప్రధాన పట్టణాల్లోని మూడింట రెండొంతుల ఔట్‌లెట్లలో డిజిటల్ చెల్లింపుల వసతులు అందుబాటులోకి వచ్చాయ మంత్రి చెప్పారు.
క్యూలో నిలబడి ప్రభుత్వ ఉద్యోగి మృతి
హూగ్లి: పశ్చిమ బెంగాల్‌లోని హూగ్లిలో నగదు కోసం ఏటీఎం వద్ద లైన్‌లో నిల్చొన్న ప్రభుత్వ ఉద్యోగి శనివారం ఉదయం చనిపోయాడు. కల్లోల్ రాయ్‌చౌధరి(56) అనే ప్రభుత్వ ఉద్యోగి కూచ్ బెహార్‌లోని తన కార్యాలయం నుంచి కోల్‌కతాలో ఉన్న ఇంటికి వెళ్తుండగా నగదు కోసం హూగ్లిలో ఆగాడు. స్టేషన్ రోడ్డులోని ఎస్‌బీఐ ఏటీఎం వద్ద నిల్చున్న 20 నిమిషాల తరువాత కుప్పకూలిపోయాడు. ఎవరూ సాయం చేయడానికి ముందుకు రాకపోవడంతో సుమారు 30 నిమిషాలు అలాగే ఉండిపోయాడు. తరువాత అక్కడి సెక్యూరిటీ గార్డు పిలిపించిన డాక్టర్... అతడు అప్పటికే చనిపోయాడాని నిర్ధరించాడు.
ముంబై టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్
ముంబై, శివారు ప్రాంతాల్లోని బ్యాంకులు, ఏటీఎం వద్ద క్యూ లైన్లు శనివారం ఏ మాత్రం తగ్గలేదు. వారాంతం కావడం, రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని బ్యాంకులు ఉన్న కొద్దిపాటి మొత్తాన్ని ప్రజలకు అందజేయగా, పెద్ద సంఖ్యలో ఏటీఎంలు తెరుచుకోలేదు. ముంబై-పుణే ఎక్స్‌ప్రెస్ వే, సియోన్-పాన్వెల్ హైవేపై టోల్‌ప్లాజాల వద్ద వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయారుు. ప్లాజాల వద్ద డిజిటల్ ద్వారా చెల్లింపులకు ఏర్పాట్లు చేసినా ఇబ్బందులు తప్పకపోవడంతో.. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.