సాక్షి, హైదరాబాద్ : కన్నడ నాట ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయపార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల సంఘంతో పాటు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ అధికారుల కళ్లుగప్పి ఓటర్ల మద్దతు పొందేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కట్టుదిట్టమైన ఆంక్షలతో ఓటర్లకు నగదు పంపిణీ కష్టతరమే కాకుండా అసాధ్యంగా మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు డిజిటల్ బాట పట్టారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని నగదు కొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థులకు ఆన్‌లైన్ లావాదేవీలు అందివచ్చినట్టు అయ్యింది. వివిధ సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్–డీబీటీ) స్కీం నుంచి ఈ పార్టీల అభ్యర్థులు స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తోంది.
ఇదీ పద్ధతి...
ఈ అభ్యర్థుల విశ్వాసపాత్రులు ముందుగా ఓటర్లను కలుస్తారు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, సెల్‌ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫలానా క్యాండెట్‌కే ఓటు వేస్తామంటూ ఓటర్ల నుంచి వాగ్దానం తీసుకుంటారు. ఇందుకోసం ఓటుకు రూ.2 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, మొదటి ఇన్‌స్టాల్‌మెంట్ కింద వెంటనే రూ.వెయ్యి ఓటర్ అకౌంట్‌కు పంపిస్తారు. ఓటింగ్ ముగిసాక రెండో ఇన్‌స్టాల్‌మెంట్ కింద మరో వెయ్యి రూపాయిలు ట్రాన్స్‌ఫర్‌పై హామీనిస్తారు. ఈ రెండో దఫా చెల్లింపు మాత్రం అభ్యర్థి గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంలో సంబంధిత రాజకీయపార్టీ అభ్యర్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా అతడి నమ్మకస్తులైన కార్యకర్తలు లేదా ఇతర వ్యాపారవేత్తలు,సన్నిహితుల అకౌంట్ల నుంచి నగదు బదిలీ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల డబ్బు ఓటరు అకౌంట్లోకి ఎవరి ప్రోద్భలంతో వచ్చిందన్న దానిపై నిఘావర్గాలు పసిగట్టే అవకాశం దాదాపు ఉండదు. అదీకూడా కొన్ని వేల మొత్తంలోనే ఈ లావాదేవీలు సాగుతుండడంతో ఆదాయపుపన్ను శాఖ కనిపెట్టడం కూడా కష్టమవుతోంది.
ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమూ ఉంది...
వ్యక్తిగతంగా ఒక్క ఓటరుకు పరిమితంగా కాకుండా ఈ పథకంలో భాగంగా ఫ్యామిలీ ప్యాకేజీలు సైతం అమలవుతున్నాయి. ఒక కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి అన్ని వేల రూపాయలు మొదటి దఫా కింద వారి అకౌంట్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్‌మెంట్ పర్యవేక్షిస్తున్నా, డిజిటల్ లావాదేవీల వ్యాప్తిలో భాగంగా మొబైల్ యాప్‌ల నుంచి ఓటర్లకు పంపిస్తున్న డబ్బును గుర్తించడం కష్టమవుతోంది. ఓట్ల కొనుగోలు కోసమే ఈ నగదు బదిలీ అయ్యిందని నిరూపించడం కూడా అసాధ్యంగా మారుతోంది.
కేంద్ర ప్రభుత్వం ‘జన్ ధన్ యోజన’లో భాగంగా సంక్షేమ పథకాల లబ్ది కోసం గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోని వారు బ్యాంక్ ఖాతాలు తెరవడంతో ఎన్నికల్లో డబ్బు పంపిణీకి రాజకీయపార్టీలు, అభ్యర్థుల పని మరింత సులువవుతోంది. బ్యాంకుల సాయంతో ›ప్రతీ లావాదేవీని తాము పరిశీలిస్తున్నా అభ్యర్థులు అనుసరిస్తున్న కొత్త ట్రిక్కుల వల్ల వీటి కట్టడి సాధ్యం కావడం లేదని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. ఓటర్లకు ఆన్‌లైన్‌లో నగదు బదిలీకి సంబంధించి ఫిర్యాదులు రావడంతో నిఘాను మరింత పెంచినట్టు, అయితే మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులను ఓ కంట కనిపెట్టడం ఎలాగన్నది తెలియడం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment