direct benefit transfer
-
డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై హైకోర్టును ఆశ్రయించిన లబ్ధిదారులు
సాక్షి, విజయవాడ: పేదలన్నా.. సంక్షేమ పథకాలన్నా టీడీపీ అధినేత చంద్రబాబుకి ఎందుకంత కడుపుమంటో అర్థం కావడం లేదు. మొన్నటికి మొన్న వాలంటీర్లను అడ్డుకుని అవ్వాతాతల ప్రాణాలతో చెలగాటం ఆడిన చంద్రబాబు.. ఇప్పుడు అక్కచెల్లెమ్మలు, విద్యార్థులు, రైతులకి సాయం అందకుండా వారి జీవితాలతో ఆడుకునే కుట్రకు తెరలేపాడు. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలైన వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ ఈబీసీ నేస్తం, రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, జగనన్న విద్యా దీవెన, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అడ్డుకుంటూ, లబ్దిదారులకు డబ్బులు చేరకుండా చంద్రబాబు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో ఏపీలో ప్రభుత్వ పథకాల నిధుల విడుదలకు ఈసీ అనుమతి నిరాకరించింది.తాజాగా ఇప్పటి వరకు కొనసాగుతున్న డీబీటీ పథకాలను ఈసీ అడ్డుకోవడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. విద్యాదీవెన, ఇన్పుట్ సబ్సిడీ నిధులను అడ్డుకోవడంపై విద్యార్ధులు, రైతులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత నిధుల విడుదలను ఈసీ నిరాకరించడంపై హైకోర్టులో మహిళా సంఘం సభ్యులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిని లంచ్ మోషన్ కింద హైకోర్టు విచారించనుంది. -
నగదు బదిలీతో ఆర్థిక వ్యవస్థకు మేలే!
ఏపీలో ఇప్పుడున్న పాలక పక్షానికి (వైఎస్సార్సీపీ) గత మూడున్నర ఏళ్ల క్రితం ఎకాఎకిన 151 అసెంబ్లీ సీట్లను ప్రజలు కట్టబెట్టారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వైసీపీ ప్రభుత్వం – నూతన పరి పాలనా సంస్కరణలతో, తాను చేసిన వాగ్దానాల మేరకు... సంక్షేమ పథకాలు, ఉద్యోగకల్పన, పరిపాలనా వికేంద్రీ కరణతో శరవేగంగా దూసుకపోతూ వచ్చింది. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అన్ని పథకాల్లోకెల్లా బాగా ప్రాచుర్యం పొందినవి రెండు – ఒకటి యువతకు భారీ ఉద్యోగ కల్పన. రెండు – నగదు బదిలీ పథకం. నగదు బదిలీ పథకం విషయంలో ‘పేదల్ని కూర్చోబెట్టి పోషిస్తున్నా’ రంటూ అనేకమంది అక్కసు వెళ్ళగక్కుతూ వస్తున్నారు. వాస్తవానికి ప్రజలకు చేస్తున్న ఈ నగదు బదిలీ వల్ల ఖజానాకు ఒక్క పైసా నష్టం రాకపోగా; నగదు బదిలీ జరిగిన మరుసటి వారంలోపే దానిలో అత్యధిక భాగం తిరిగి చిల్లర వ్యాపారులకు – తద్వారా రాష్ట్ర ఖజానాకే చేరుతుంది ఆ డబ్బంతా! ఈ ద్రవ్య సంచయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నిత్యం ఆదాయం వస్తూనే ఉంటుంది. నగదు బదిలీ పథకం వల్ల ప్రజలకు కొత్తగా తెలిసిందేమంటే – ఇంత భారీగా ప్రజ లకు ఇవ్వగలిగిన సొమ్ము – ఇప్పటి వరకు గత పాలకులు తమకు దక్కకుండా చేశారనే విషయం. ఇక ఉద్యోగ కల్పన విషయానికి వస్తే... గత ప్రభుత్వాలు యువతకు ఉద్యోగాలు కల్పించకపోగా; ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతుల్లో ఉద్యోగ నియామకాలు చేసి, దళారీల దోపిడీకి తలుపులు బార్లా తెరిచాయి. ఇంతే కాదు, ఇలాంటి అస్థిర ఉద్యోగాల వల్ల అటువంటి ఉద్యో గులు – ఎప్పుడు ఊడిపోతుందో తెలియని ఉద్యోగాలతో రాజీ పడలేక, నాణ్యమైన సేవలు అందించలేక అస్థిర జీవనం కొనసాగించే వారు. అలాంటి తరుణంలో – వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేపట్టిన భారీ ఉదార ఉద్యోగ కల్పన వల్ల కొన్ని లక్షల మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ ఉద్యోగాల కల్పన వల్ల యువతకు సుస్థిర జీవనం సాగించే అవకాశంతో పాటు; తమ మీద తమకు ఆత్మ విశ్వాసం పెరిగింది. వీరికిచ్చే జీతాల వల్ల రాష్ట్ర ఖజానాపై పెను భారం పడుతుందన్న ప్రతిపక్షాల చీకటి ప్రచారాలు కూడా సరైన వాదనకు నిలబడేవి కావు. కారణం – ఇన్ని లక్షల మందికి చెల్లించే వందల కోట్ల జీతాల మొత్తాలు మరుసటి రోజే మార్కెట్లోకి వెళ్ళి పోతున్నాయి ఖర్చుల రూపంలో. ఖర్చులోనే ఆదాయ ముంటుందన్న ఆర్థిక సూత్రం మేరకు మళ్ళీ వీరి ఖర్చు ప్రభుత్వ ఖజానాలకు ఆదాయంగా మారుతోంది. అందువల్ల వీరి జీతాలను ఖర్చుగా భావించనక్కర్లేదు. పై పెచ్చు ఈ భారీ ఉద్యోగిత వల్ల పాలనా, సేవా సౌకర్యాలు అత్యంత సామాన్యుని ఇంటి ముంగిట వరకు చేరటంతో – పౌర సమాజానికి సమయం, డబ్బు ఆదా అవుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మానవ వనరుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత నిచ్చి, ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు చదువుకొనే విద్యార్థులకు అనేక ఫీజు రాయితీలు కల్పిస్తూ; ప్రభుత్వ రంగ విద్యా సంస్థ ల్లోని సౌకర్యాలను మెరుగుపరుస్తూ గ్రామీణ నిరుపేద విద్యార్థులకు విద్యను అందుబాటులోకి తేవటం వల్ల... సమీప భవిష్యత్తులో నాణ్యమైన ప్రమాణాలు కల విద్యార్థి సమూహం సమాజంలోకి ధీమాగా అడుగు పెడుతుంది. ఇక వైద్య రంగాన్ని గమనిస్తే – వైద్య, ఆరోగ్య రంగాలలో భారీ ఉద్యోగితను కల్పించటం; ప్రభుత్వ రంగ వైద్య ఆరోగ్య సంస్థలను అభివృద్ధి పరచడం... తద్వారా అందని ద్రాక్షగా తయారైన వైద్యాన్ని సామాన్యుని ముంగిటకు తెచ్చినట్టయింది. రాష్ట్ర విభజన సందర్భంగా తలెత్తిన సమస్యలూ, గత ప్రభుత్వం చేసిన నిర్వాకాలు ఫలితంగా మిగిలిన అప్పులూ... వెరసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంక్షేమ కార్యక్రమాల నిర్వహణను భారం చేశాయి. అంతకు ముందు ఐదేళ్లల్లో ఏనాడూ ప్రజా సంక్షేమాన్ని అంతగా పట్టించుకోని చంద్రబాబు ఎన్నికల సంవత్సరంలో మాత్రం ఎడాపెడా రాష్ట్రమంతటా రోడ్లు వేయించ పూనుకున్నాడు. వేగుల ద్వారా – ప్రభుత్వంపై ఉన్న తారాస్థాయి అసంతృప్తి సమాచారాన్ని తెలుసుకొన్న తాను దోమలపై దండయాత్ర అంటూ, పంచాయితీలకు ఎన్నికల సంవత్సరం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా నిధులిచ్చాడు. ఈ ‘ఆఖరు క్షణం ఖర్చుల’ వల్ల రాష్ట్రానికి మూడు విధాల నష్టం వాటిల్లింది. కాంట్రాక్టర్లు, స్థానిక నాయకులతో చేతులు కలిపి భారీగా అవినీతికి పాల్పడటం మొదటిది కాగా; ఈ అవినీతి వల్ల పనుల్లో నాణ్యత తగ్గటం రెండోది. ఈ పర్యవసానాల వల్ల రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ అవ్వడం మూడోది. ఫలితంగా జగన్ తన పాలనను ‘మైనస్ జీరో బడ్జెట్’ నుండి మొదలు పెట్టాడని చెప్పాలి. ఎందుకంటే – అప్పటికే రాష్ట్రానికి ఉన్న అప్పు – 2 లక్షల 64 వేల, 451 కోట్లు కాగా, చేతిలో చిల్లిగవ్వ లేకుండా రాష్ట్ర బొక్కసం మొత్తం ఖాళీ కావటం వల్ల వైఎస్ జగన్ ప్రభుత్వానికి తొలిరోజు నుండే ఆర్థిక ఇబ్బందులు తప్పలేదు. గత ప్రభుత్వం చేసిన అప్పులపై కనీసంగా వెయ్యి కోట్ల రూపాయిలు వడ్డీ ప్రతి నెలా చెల్లించాల్సి వస్తోంది. అయినా కూడా పేదల కోసం మొద లెట్టిన నగదు బదిలీ పథకం అప్రతిహతంగా కొనసాగించే విషయంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని అభినందించాల్సిందే! (క్లిక్ చేయండి: ఆస్తుల విభజన చేసేది ఎన్నడు?) - మాకా రాజేంద్రన్ సామాజిక విశ్లేషకుడు -
నగదు బదిలీతో రూ . 1,70,000 కోట్లు ఆదా
సాక్షి, న్యూఢిల్లీ : లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీల ద్వారా అవినీతి, కుంభకోణాలను నిరోధించగలిగామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ ద్వారా ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పేదలు నూరు శాతం పొందుతున్నారని పేర్కొన్నారు. నగదు బదిలీ ద్వారా 1,70,000 కోట్ల రూపాయలు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లకుండా ఆదా చేయగలిగామని చెప్పారు. విజిలెన్స్, అవినీతి నిరోధక చర్యలపై ‘సతర్క్ భారత్..సమృద్ధ భారత్’ పేరిట మంగళవారం జరిగిన జాతీయ సదస్సులో మోదీ ప్రారంభోపన్యాసం చేశారు. అవినీతి నియంత్రణలో గత ప్రభుత్వాల తీరును ప్రధాని తప్పుపట్టారు. చదవండి : డిమాండ్‌కు భారత్ ‘ఇంధనం’ గత దశాబ్ధాల్లో అవినీతి తరం శిక్షకు నోచుకోకపోవడంతో తర్వాతి తరం మరింత దూకుడుగా అవినీతికి పాల్పడిందని దుయ్యబట్టారు. దీంతో పలు రాష్ట్రాల్లో అవినీతి రాజకీయ సంప్రదాయంలో భాగంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. తరాల తరబడి సాగిన అవినీతి దేశాన్ని చెదపురుగుల్లా తినేశాయని దుయ్యబట్టారు. నేడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. పౌరుల జీవితాన్ని సరళతరం చేసేలా పలు పాత చట్టాలను తొలగించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయని అన్నారు.అవినీతిపై మనం వ్యవస్థాగతంగా కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని అన్నారు. అవినీతిని నియంత్రించేందుకు సామర్ధ్యాలకు పదునుపెట్టడంతో పాటు శిక్షణా కార్యక్రమాలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. -
లేబర్ సెస్‌ను వాడుకోండి!
సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్మాణ పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీంతో నిర్మాణ రంగ కార్మికుల జీవనోపాధికి ఆటంకం ఏర్పడింది. నిర్మాణ సంస్థలు చెల్లించే లేబర్ సెస్‌ను కార్మికుల సంక్షేమానికి వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇటీవలే ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) ద్వారా అసంఘటిత రంగంలోని కార్మికులకు ఆర్థిక, అనుబంధ ప్రయోజనాలను కల్పించడానికి లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంత ప్రభుత్వాలకు సూచించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కేంద్ర కార్మిక మరియు ఉపాధి శాఖలో 3.5 కోట్ల మంది కార్మికులు నమోదయ్యారు. ఈ బోర్డులో సుమారు రూ.52 వేల కోట్ల కార్పస్ ఫండ్ ఉందని కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ తెలిపింది. రూ.2 వేల కోట్ల లేబర్ సెస్.. గతేడాది మార్చి నాటికి తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డులో 13 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు నమోదయ్యారు. ఇందులో 10 శాతం మంది ఆంధ్రప్రదేశ్, బిహార్, ఉత్తరప్రదేశ్, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల కార్మికులుంటారు. ప్రస్తుతం కార్మిక సంక్షేమ బోర్డులో రూ.1,800–2,000 కోట్ల లేబర్ సెస్ నిల్వ ఉందని తెలంగాణ కార్మిక సంక్షేమ బోర్డ్ సభ్యుడు గంధం ఆంజనేయులు తెలిపారు. గుర్తింపు కార్డ్ ఉన్నవాళ్లకు మాత్రమే లేబర్ సెస్ ప్రయోజనం వర్తిస్తుందని.. ఆయా కార్మికుల ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానమై ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం నిర్ణయించే ప్రయోజన సొమ్ము నేరుగా ఖాతాలో జమ అవుతుందని పేర్కొన్నారు. కార్మికులందరికీ ప్రయోజనం.. భవన, నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి నియంత్రణ మరియు సేవల చట్టం కింద కార్మిక సంక్షేమ బోర్డులు లేబర్ సెస్‌ను సమీకరిస్తుంటాయి. డెవలప్మెంట్ అథారిటీ, హౌసింగ్ బోర్డు లేదా మున్సిపల్ కార్పొరేషన్లు ప్రాజెక్ట్ వ్యయంలో 1 శాతం సెస్ రూపంలో డెవలపర్ల నుంచి వసూలు చేస్తుంటాయి. లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఈ రంగంలోని కార్మికుల జీవనోపాధికి ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు లేబర్ సెస్‌ను వినియోగించుకోవాలని కాన్ఫడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ (క్రెడాయ్) ప్రభుత్వాన్ని కోరింది. కార్మిక సంక్షేమ బోర్డులో నమోదైన వాళ్లకు మాత్రమే కాకుండా అసంఘటిత రంగంలోని కార్మికులందరికీ ఈ నిధుల ప్రయోజనం అందేలా చూడాలని క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ సీహెచ్ రామచంద్రా రెడ్డి కోరారు. శాశ్వత కార్మికులను మాత్రమే డెవలపర్లు కార్మిక సంక్షేమ బోర్డులో నమోదు చేస్తుంటారు. రోజూ వారీ వేతనం కింద కూలీలు, కాంట్రాక్ట్ వర్కర్లను వినియోగించుకుంటారు. కరోనా ‘కేర్’ నిర్మాణ ప్రదేశాల్లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ మున్సిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖ డెవలపర్లకు పలు సూచనలను జారీ చేసింది. అవేంటంటే.. ► కరోనా వైరస్, దాని ప్రభావ తీవ్రత గురించి కార్మికుల్లో అవగాహన కల్పించాలి. ► సబ్బు, శానిటైజర్‌తో సాధ్యమైనన్ని ఎక్కువ సార్లు రెండు చేతులను మోచేతి వరకు శుభ్రం చేసుకోవాలి. ► కార్మికులు ఉండే ప్రదేశాలు, చుట్టుపక్కల ప్రాంతాలు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. టాయిలెట్స్‌లను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ► ప్రాజెక్ట్ ప్రాంతాల్లో కార్మికులు గుంపులుగా ఉండకూడదు. వ్యక్తికి వ్యక్తికి మధ్య కనీసం 6 ఫీట్ల సామాజిక దూరాన్ని మెయిన్‌టెన్ చేయాలి. ► ప్రాజెక్ట్‌లు, లేబర్ క్యాంప్లలోకి బయటి వ్యక్తులను, అపరిచితులను రానివ్వకూడదు. ► లాక్డౌన్ ఉన్నన్ని రోజులు కార్మికులకు అవసరమైన బియ్యం, కూరగాయలు, పాలు వంటి నిత్యావసరాలన్నింటినీ ఒకేసారి సమకూర్చుకోవాలి. ఆయా నిత్యావసరాల కొనుగోలు కోసం అందరూ వెళ్లకుండా ఒక్కరు మాత్రమే వెళ్లాలి. ► ఎవరైనా కార్మికులు అనారోగ్యంగా ఉంటే అందరితో కలిసి కాకుండా ప్రత్యేకంగా వేరే షెడ్‌ను ఏర్పాటు చేసి.. క్వారంటైన్లో ఉండాలి. ముందుగా సంబంధిత ప్రభుత్వ విభాగానికి సమాచారం అందించాలి. ► నిర్మాణ కార్మికులుండే ప్రాంతాల్లో వైద్య బృందాలను ఏర్పాటు చేసి తరచుగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి. వినియోగ, తాగునీటి అవసరాలకు అంతరాయం లేకుండా చూసుకోవాలి. -
కర్ణాటక ఎన్నికలు: ఆన్లైన్లో నగదు బదిలీ
సాక్షి, హైదరాబాద్ : కన్నడ నాట ఓటర్ల దృష్టిని ఆకర్షించేందుకు రాజకీయపార్టీలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఎన్నికల సంఘంతో పాటు స్థానిక ఎన్నికల పర్యవేక్షణ అధికారుల కళ్లుగప్పి ఓటర్ల మద్దతు పొందేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. కట్టుదిట్టమైన ఆంక్షలతో ఓటర్లకు నగదు పంపిణీ కష్టతరమే కాకుండా అసాధ్యంగా మారిన నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులు డిజిటల్ బాట పట్టారు. దేశవ్యాప్తంగా ముఖ్యంగా ఎన్నికలు జరగనున్న కర్ణాటక, పొరుగు రాష్ట్రాల్లోని నగదు కొరత తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో కర్ణాటక అభ్యర్థులకు ఆన్లైన్ లావాదేవీలు అందివచ్చినట్టు అయ్యింది. వివిధ సంక్షేమ పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ప్రత్యక్ష ప్రయోజన బదిలీ’ (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్–డీబీటీ) స్కీం నుంచి ఈ పార్టీల అభ్యర్థులు స్ఫూర్తి పొందినట్టు కనిపిస్తోంది. ఇదీ పద్ధతి... ఈ అభ్యర్థుల విశ్వాసపాత్రులు ముందుగా ఓటర్లను కలుస్తారు. వారి బ్యాంక్ అకౌంట్ వివరాలు, సెల్‌ఫోన్ నెంబర్లు కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఫలానా క్యాండెట్‌కే ఓటు వేస్తామంటూ ఓటర్ల నుంచి వాగ్దానం తీసుకుంటారు. ఇందుకోసం ఓటుకు రూ.2 వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని, మొదటి ఇన్స్టాల్మెంట్ కింద వెంటనే రూ.వెయ్యి ఓటర్ అకౌంట్‌కు పంపిస్తారు. ఓటింగ్ ముగిసాక రెండో ఇన్స్టాల్మెంట్ కింద మరో వెయ్యి రూపాయిలు ట్రాన్స్‌ఫర్‌పై హామీనిస్తారు. ఈ రెండో దఫా చెల్లింపు మాత్రం అభ్యర్థి గెలుపోటములపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యవహారంలో సంబంధిత రాజకీయపార్టీ అభ్యర్థి వ్యక్తిగత బ్యాంక్ ఖాతా నుంచి కాకుండా అతడి నమ్మకస్తులైన కార్యకర్తలు లేదా ఇతర వ్యాపారవేత్తలు,సన్నిహితుల అకౌంట్ల నుంచి నగదు బదిలీ చేస్తున్నారు. ఈ పద్ధతి వల్ల డబ్బు ఓటరు అకౌంట్లోకి ఎవరి ప్రోద్భలంతో వచ్చిందన్న దానిపై నిఘావర్గాలు పసిగట్టే అవకాశం దాదాపు ఉండదు. అదీకూడా కొన్ని వేల మొత్తంలోనే ఈ లావాదేవీలు సాగుతుండడంతో ఆదాయపుపన్ను శాఖ కనిపెట్టడం కూడా కష్టమవుతోంది. ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమూ ఉంది... వ్యక్తిగతంగా ఒక్క ఓటరుకు పరిమితంగా కాకుండా ఈ పథకంలో భాగంగా ఫ్యామిలీ ప్యాకేజీలు సైతం అమలవుతున్నాయి. ఒక కుటుంబంలోని ఓటర్ల సంఖ్యను బట్టి అన్ని వేల రూపాయలు మొదటి దఫా కింద వారి అకౌంట్లలోకి వచ్చి చేరుతున్నాయి. అయితే బ్యాంక్ అకౌంట్ల లావాదేవీలను ఇన్‌కమ్‌టాక్స్ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తున్నా, డిజిటల్ లావాదేవీల వ్యాప్తిలో భాగంగా మొబైల్ యాప్‌ల నుంచి ఓటర్లకు పంపిస్తున్న డబ్బును గుర్తించడం కష్టమవుతోంది. ఓట్ల కొనుగోలు కోసమే ఈ నగదు బదిలీ అయ్యిందని నిరూపించడం కూడా అసాధ్యంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ‘జన్ ధన్ యోజన’లో భాగంగా సంక్షేమ పథకాల లబ్ది కోసం గ్రామీణ ప్రాంతాలతో సహా అన్ని ప్రాంతాల్లోని వారు బ్యాంక్ ఖాతాలు తెరవడంతో ఎన్నికల్లో డబ్బు పంపిణీకి రాజకీయపార్టీలు, అభ్యర్థుల పని మరింత సులువవుతోంది. బ్యాంకుల సాయంతో ›ప్రతీ లావాదేవీని తాము పరిశీలిస్తున్నా అభ్యర్థులు అనుసరిస్తున్న కొత్త ట్రిక్కుల వల్ల వీటి కట్టడి సాధ్యం కావడం లేదని ఎన్నికల అధికారులే చెబుతున్నారు. ఓటర్లకు ఆన్లైన్లో నగదు బదిలీకి సంబంధించి ఫిర్యాదులు రావడంతో నిఘాను మరింత పెంచినట్టు, అయితే మొబైల్ యాప్‌ల ద్వారా చెల్లింపులను ఓ కంట కనిపెట్టడం ఎలాగన్నది తెలియడం లేదని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ సంజయ్ కుమార్ పేర్కొన్నారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కరెంట్‌కూ నగదు బదిలీ: నీతి ఆయోగ్
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల మాదిరిగానే విద్యుత్ సరఫరాకు కూడా నగదు బదిలీ(డీబీటీ) పథకం అమలుకు నీతి ఆయోగ్ మద్దతు తెలిపింది. కనీవిని ఎరగని రీతిలో పెద్దనోట్లను రద్దు చేసిన దేశం విద్యుత్ రంగంలో నగదు బదిలీ ప్రవేశపెట్టే సాహసం చేయొచ్చని అభిప్రాయపడింది. అధిక భాగం ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ఈ రంగంలో సత్ఫలితాలు సాధించాలంటే దీర్ఘకాలంలో ప్రైవేటీకరణ చేపట్టాలని సంస్థ సీఈఓ అమితాబ్ కాంత్ సూచించారు. బుధవారం ఆయన ఇండియా ఎనర్జీ ఫోరంలో మాట్లాడారు. ‘ఏ వినియోగదారుడు కూడా డీబీటీ లేకుండా విద్యుత్ పొందకూడదు. బలవంతంగానైనా దీన్ని అమలు చేయాలి. మార్కెట్ ధరల ప్రాతిపదికన ధరలు నిర్ణయించే, పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించే నియంత్రణ సంస్థలు రావాలి’ అని కాంత్ అన్నారు. దిగువ స్థాయుల్లో మీటర్ విధానం అమల్లోకి రాకుంటే విద్యుత్ రంగం మనుగడ సాధించలేదని పేర్కొన్నారు. డీజిల్ వినియోగం తగ్గించాలంటే కాలుష్య పన్నులు విధించాలని సూచించారు. కేవలం పదేళ్లే జీవిత కాలమున్న బొగ్గు వాడకాన్ని ప్రోత్సహించాలని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం దేశ ఇంధన రంగం విష వలయంలో చిక్కుకుందని ఇందులో మార్పు రావాలని తెలిపారు. -
ఆధార్‌తో 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం
ముంబై: డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌కు (డీబీటీ-సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పొందడం) సంబంధించి ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ అనుసంధాన ప్రక్రియకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. జూన్ 30వ తేదీ నాటికి ఆధార్‌తో 17 కోట్ల డీబీటీ అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానించాలన్నది లక్ష్యమని ఆర్బీఐ నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్పీసీఐ పేర్కొంది. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలు పొందుతున్న వారందరినీ కొద్ది కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కిందకు తీసుకువస్తామని తెలిపింది. సబ్సిడీల్లో ఎటువంటి లోటుపాట్లూ జరక్కుండా చూడడం, అనవసర వ్యయాలను అరికట్టడం వంటి లక్ష్యాల సాధనకు డీబీటీపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రయోజనంసహా ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో కేంద్రం జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించి ఈ విషయంలో మంచి పురోగతి సాధించిన సంగతి తెలిసిందే. -
గ్యాస్ తో ఆధార్ లింక్ తెగింది
నగదు బదిలీ పథకంతో భాగంగా ఆధార్ కార్డుతో ఉన్న సబ్సిడీ వంటగ్యాస్ సిలెండర్ల లింక్ ను తొలగించాలని రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటి నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలోనే గృహ వినియోగదారులకు సబ్సిడీ మాద ఇచ్చే గ్యాస్ సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దేశంలోని దాదాపు 99 శాతం మంది ప్రజలు సబ్సిడీ మీద అందే గ్యాస్ సిలిండర్లనే ఉపయోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం కాస్త ఉపశమనం కలిగించే అవకాశం కనిపిస్తోంది. ఆధార్ తో ఉన్న ఎల్ పీజీ సబ్బిడీ బదిలీ పథకాన్ని నిలిపివేశామని పెట్రోలియ శాఖ మంత్రి ఎమ్ వీరప్ప మెయిలీ తెలిపారు. మార్కెట్ రేట్ ప్రకారం కొనుగోలు చేసిన వంటగ్యాస్ పై సబ్సిడీని బ్యాంక్ అకౌంట్ల ద్వారా వినియోగదారులకు బదిలీ చేస్తున్న విషయం తెలిపిందే. 18 రాష్ట్రాల్లో 289 జిల్లాల్లో కొనసాగుతున్న ఈ నగదు బదిలీ పథకాన్ని నిలిపివేస్తున్నామని మొయిలీ వివరించారు. అ పథకంపై అనేక ఫిర్యాదులు కమిటీకి అందాయని.. ఆధార్ కార్డు వినియోగం అనేక సమస్యల్ని సృష్టిస్తున్నట్టు ఫిర్యాదులు వస్తున్న నేపథ్యలో కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో చాలా మందికి ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్లు లేకపోవడం అనేక సమస్యలకు కారణమవుతోంది అని మొయిలీ ఓప్రశ్నకు సమాధానమిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయానికి పెద్ద ఎత్తున వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.