ఆధార్‌తో 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం
ముంబై: డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌కు (డీబీటీ-సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పొందడం) సంబంధించి ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ అనుసంధాన ప్రక్రియకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్‌పీసీఐ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.
జూన్ 30వ తేదీ నాటికి ఆధార్‌తో 17 కోట్ల డీబీటీ అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానించాలన్నది లక్ష్యమని ఆర్‌బీఐ నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్‌పీసీఐ పేర్కొంది. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలు పొందుతున్న వారందరినీ కొద్ది కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కిందకు తీసుకువస్తామని తెలిపింది. సబ్సిడీల్లో ఎటువంటి లోటుపాట్లూ జరక్కుండా చూడడం, అనవసర వ్యయాలను అరికట్టడం వంటి లక్ష్యాల సాధనకు డీబీటీపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రయోజనంసహా ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో కేంద్రం జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించి ఈ విషయంలో మంచి పురోగతి సాధించిన సంగతి తెలిసిందే.