Bank Accounts linked
-
మీ బ్యాంకు ఖాతాలో నగదు జమ కావడం లేదా..? కారణం ఇదే..
పెదవాల్తేరు(విశాఖపట్నం): ఎన్పీసీఐ ఈ మాట సచివాలయాలలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాల కింద సొమ్ముని బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుండడం తెలిసిందే. ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న బ్యాంకు ఖాతాలలో మాత్రమే పథకాల సొమ్ము జమ అవుతుంది. చాలా మందికి ఈ విషయం తెలియక తమ బ్యాంకు ఖాతాలలో ఎందుకు సొమ్ము పడలేదంటూ సచివాలయాలకు ప్రదక్షిణలు చేస్తున్నారు. అక్కడ వార్డు వలంటీర్లు, సంక్షేమ కార్యదర్శులు బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం ఉన్న ఖాతాలకే సొమ్ము పడుతుందని చెప్పడంతో బ్యాంకులకు పరుగులు తీస్తున్నారు. ఇంతకీ ఎన్పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని అర్థం. చదవండి: దేశ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ఘట్టం ఒక వ్యక్తికి ఒక బ్యాంకు ఖాతా మాత్రమే ఉంటే ఎన్పీసీఐ అనుసంధానం ద్వారా ఆయా పథకాల సొమ్ము ప్రయోజనాలు నేరుగా సదరు ఖాతాలోనే జమ అవుతాయి. కానీ, కొంత మందికి ఒకటి కన్నా రెండు లేదా అంతకన్నా ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటాయి. అప్పుడు సమస్య వస్తుంది. వాస్తవానికి ఇన్ని ఖాతాలలో ఏదో ఒక ఖాతాకు మాత్రమే బ్యాంకులో ఎన్పీసీఐ అనుసంధానం చేసి ఉంటారు. కానీ లబ్ధిదారులు మాత్రం అమ్మ ఒడి, చేయూత, వాహన మిత్ర, కాపు నేస్తం తదితర పథకాల కింద పేర్లు నమోదు సమయంలో తెలియక వేరే బ్యాంకు ఖాతాలు ఇస్తుండడంతో చాలా మందికి నగదు జమ అవ్వలేదు. అటువంటి సమయంలో లబ్ధిదారులు సదరు బ్యాంకులకు వెళ్లి ఏ ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం జరిగి ఉందో తెలుసుకోవచ్చు. అలాగే, ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వారు తమకు నచ్చిన బ్యాంకు ఖాతాకు ఎన్పీసీఐ అనుసంధానం కోరుకుంటే సంబంధిత బ్యాంకులో ఆధార్, బ్యాంకు ఖాతాలతో సంప్రదించాల్సి ఉంటుంది. తరువాత ఎన్పీసీఐ అనుసంధానం గల బ్యాంకు ఖాతా జెరాక్స్ మాత్రమే ఆయా పథకాలకు దరఖాస్తు సమయంలో సచివాలయాలలో అందజేయాల్సి ఉంటుంది. -
‘ఉపాధి’కి లింక్
ఎండనకా, వాననకా ఉపాధి పనులు చేసిన కూలీలు సకాలంలో నగదు అందక అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. గతంలో పే స్లిప్‌లు ఇచ్చి పోస్టాఫీస్‌లో నగదు తీసుకునే సమయంలో బాగుండేదని, ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ పెట్టడంతో ఎక్కడ చెల్లింపులు చేస్తున్నారో తెలియడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది. చిల్లకూరు(నెల్లూరు): జిల్లాలోని 46 మండలాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 2016 నుంచి 2018వ సంవత్సరం వరకు జరిగిన పనుల్లో కూలికి వెళ్లిన వారిలో సుమారు 19,440 మంది ఖాతాలు సస్పెన్షన్‌లో ఉండడంతో నగదు చెల్లింపులు జరగలేదు. దీనికి కారణం ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు లింక్ చేయకపోవడమే. కొందరికీ అసలు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో రూ.2.03 కోట్లకు పైగా నగదు ఎక్కడ ఉందనే విషయం తెలియడం లేదు. అలాగే తిరస్కరణ పేరుతో రెండు సంవత్సరాలుగా 22,842 మంది కూలీల నగదు కూడా రూ.35 లక్షలు పైగా ఉంది. 21,173 మంది కూలీలకు సంబంధించి రూ.1.92 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం కూలీలకు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు మాత్రం ఈ పని క్షేత్ర స్థాయిలోనే జరగాలని చెబుతున్నారు. అక్కడి అధికారులు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తప్పించుకుంటున్నారు. అధికారుల తీరే కారణం అధికారులు తీసుకునే నిర్ణయాలు కూలీల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. జాబ్‌కార్డులో కుటుంబంలోని వారిలో ఎవరో ఒకరు పనికి వెళతుంటారు. ఒకరికి ఖాతా ఉంటే వారి ఖాతాలో నగదు చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రతిఒక్కరికీ బ్యాంక్ ఖాతా అవసరమని చెప్పడంతో కొందరికి వేలిముద్రలు సక్రమంగా లేకపోవడంతో ఆధార్ లింక్ కావడం లేదు. దీంతో వారు ఖాతా ప్రారంభంచలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు అనుసంధానం చేయించాల్సిన బాధ్యత అధికారులదే అయినా పట్టించుకోవడం లేదు. ఖాతాలను ఆఖరుగా భారత జాతీయ చెల్లింపుల సంస్థకు అనుసంధానం చేస్తేనే కూలీలకు నగదు చెల్లింపులు జమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందుకు బ్యాంకు అధికారులతో ఉపాధి హామీ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి కూలీలకు నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది. ఆధార్ లేక ఖాతా తెరవలేదు ఏడాదిగా ఉపాధి పనికి వెళుతున్నా. అయితే ఒక్క రూపాయి కూడా చేతికందలేదు. ఆధార్ తీయించుకునేందుకు వెళితే వేలిముద్రలు పడలేదని చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతా చేయించుకోలేకపోయా. పనికి వెళుతున్నా డబ్బు అందడం లేదు. – గడ్డం మణెయ్య, కలవకొండ ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నాం జిల్లాలోని ప్రతి ఏపీఓతో సస్పెన్షన్ ఖాతాల విషయంపై రివ్యూ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని ఖాతాలకు సంబంధించిన నగదు చెల్లింపులను 15 రోజుల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు ఆధార్, జాబ్ కార్డు లింక్ చేయాలని ఆదేశించాం. – బాపిరెడ్డి, పీడీ, డ్వామా -
ఆధార్‌తో 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు అనుసంధానం
ముంబై: డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్‌కు (డీబీటీ-సబ్సిడీలు, ఇతర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులు బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా ప్రత్యక్షంగా పొందడం) సంబంధించి ఇప్పటి వరకూ దేశంలో దాదాపు 15 కోట్ల బ్యాంక్ అకౌంట్లు ఆధార్‌తో అనుసంధానమయ్యాయి. ఈ అనుసంధాన ప్రక్రియకు నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ (ఎన్పీసీఐ) ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది. జూన్ 30వ తేదీ నాటికి ఆధార్‌తో 17 కోట్ల డీబీటీ అకౌంట్లను ఆధార్‌తో అనుసంధానించాలన్నది లక్ష్యమని ఆర్బీఐ నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్పీసీఐ పేర్కొంది. ప్రభుత్వ సబ్సిడీలు, ప్రయోజనాలు పొందుతున్న వారందరినీ కొద్ది కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కిందకు తీసుకువస్తామని తెలిపింది. సబ్సిడీల్లో ఎటువంటి లోటుపాట్లూ జరక్కుండా చూడడం, అనవసర వ్యయాలను అరికట్టడం వంటి లక్ష్యాల సాధనకు డీబీటీపై కేంద్రం దృష్టి సారిస్తోంది. ఈ ప్రయోజనంసహా ఆర్థిక వ్యవస్థలో అందరినీ భాగస్వాములను చేయాలన్న లక్ష్యంతో కేంద్రం జన్‌ధన్ యోజన కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టులో ప్రారంభించి ఈ విషయంలో మంచి పురోగతి సాధించిన సంగతి తెలిసిందే.