కలవకొండలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలు (ఫైల్)
ఎండనకా, వాననకా ఉపాధి పనులు చేసిన కూలీలు సకాలంలో నగదు అందక అవస్థలు పడుతున్నారు. నెలల తరబడి సంబంధిత కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా ఫలితం కనిపించడం లేదు. అధికారులు కూడా స్పందించడం లేదు. గతంలో పే స్లిప్‌లు ఇచ్చి పోస్టాఫీస్‌లో నగదు తీసుకునే సమయంలో బాగుండేదని, ఇప్పుడు బ్యాంకు ఖాతాలకు ఆధార్ లింక్ పెట్టడంతో ఎక్కడ చెల్లింపులు చేస్తున్నారో తెలియడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో దాదాపు రూ.2 కోట్ల మేర బకాయిలు చెల్లించాల్సి ఉంది.
చిల్లకూరు(నెల్లూరు): జిల్లాలోని 46 మండలాల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. 2016 నుంచి 2018వ సంవత్సరం వరకు జరిగిన పనుల్లో కూలికి వెళ్లిన వారిలో సుమారు 19,440 మంది ఖాతాలు సస్పెన్షన్‌లో ఉండడంతో నగదు చెల్లింపులు జరగలేదు. దీనికి కారణం ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు లింక్ చేయకపోవడమే. కొందరికీ అసలు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో రూ.2.03 కోట్లకు పైగా నగదు ఎక్కడ ఉందనే విషయం తెలియడం లేదు. అలాగే తిరస్కరణ పేరుతో రెండు సంవత్సరాలుగా 22,842 మంది కూలీల నగదు కూడా రూ.35 లక్షలు పైగా ఉంది. 21,173 మంది కూలీలకు సంబంధించి రూ.1.92 కోట్లకు పైగా పెండింగ్‌లో ఉంది. ఈ మొత్తం కూలీలకు ఎప్పుడు చెల్లిస్తారో తెలియని పరిస్థితి ఉంది. ఉన్నతాధికారులు మాత్రం ఈ పని క్షేత్ర స్థాయిలోనే జరగాలని చెబుతున్నారు. అక్కడి అధికారులు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు లబ్ధిదారులు ఆసక్తి చూపడం లేదని తప్పించుకుంటున్నారు.
అధికారుల తీరే కారణం
అధికారులు తీసుకునే నిర్ణయాలు కూలీల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. జాబ్‌కార్డులో కుటుంబంలోని వారిలో ఎవరో ఒకరు పనికి వెళతుంటారు. ఒకరికి ఖాతా ఉంటే వారి ఖాతాలో నగదు చెల్లింపులు చేయవచ్చు. అయితే ప్రతిఒక్కరికీ బ్యాంక్ ఖాతా అవసరమని చెప్పడంతో కొందరికి వేలిముద్రలు సక్రమంగా లేకపోవడంతో ఆధార్ లింక్ కావడం లేదు. దీంతో వారు ఖాతా ప్రారంభంచలేకపోతున్నారు. బ్యాంకు ఖాతాలకు ఆధార్, జాబ్‌కార్డులు అనుసంధానం చేయించాల్సిన బాధ్యత అధికారులదే అయినా పట్టించుకోవడం లేదు. ఖాతాలను ఆఖరుగా భారత జాతీయ చెల్లింపుల సంస్థకు అనుసంధానం చేస్తేనే కూలీలకు నగదు చెల్లింపులు జమయ్యే పరిస్థితి ఉంటుంది. ఇందుకు బ్యాంకు అధికారులతో ఉపాధి హామీ అధికారులు సమన్వయం చేసుకుని సమస్యను పరిష్కరించి కూలీలకు నగదు చెల్లింపులు చేయాల్సి ఉంది.
ఆధార్ లేక ఖాతా తెరవలేదు
ఏడాదిగా ఉపాధి పనికి వెళుతున్నా. అయితే ఒక్క రూపాయి కూడా చేతికందలేదు. ఆధార్ తీయించుకునేందుకు వెళితే వేలిముద్రలు పడలేదని చెబుతున్నారు. దీంతో బ్యాంకు ఖాతా చేయించుకోలేకపోయా. పనికి వెళుతున్నా డబ్బు అందడం లేదు. – గడ్డం మణెయ్య, కలవకొండ
ప్రతిరోజూ సమీక్ష చేస్తున్నాం
జిల్లాలోని ప్రతి ఏపీఓతో సస్పెన్షన్ ఖాతాల విషయంపై రివ్యూ చేస్తున్నాం. సాధ్యమైనంత వరకు అన్ని ఖాతాలకు సంబంధించిన నగదు చెల్లింపులను 15 రోజుల్లో చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. క్షేత్ర స్థాయిలో కంప్యూటర్ ఆపరేటర్లు ఆధార్, జాబ్ కార్డు లింక్ చేయాలని ఆదేశించాం. – బాపిరెడ్డి, పీడీ, డ్వామా
Comments
Please login to add a commentAdd a comment