
ఆ ఎమ్మెల్యేలకు ఓటుహక్కు లేదు!
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీష్ రావత్ ఈనెల 10వ తేదీన విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. తప్పో.. ఒప్పో గానీ, అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి కొద్ది ముందుగా స్పీకర్ అనర్హత వేటు వేసిన 9 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోజు విశ్వాసపరీక్షలో ఓటు వేయడానికి అనర్హులని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆరోజు ఒక పరిశీలకుడిని నియమిస్తామని, మొత్తం సభా కార్యకలాపాలు అన్నింటినీ వీడియో తీయిస్తామని చెప్పింది. మొత్తం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ తన మెజారిటీని నిరూపించుకుంటుందని హరీష్ రావత్ ధీమా వ్యక్తం చేశారు.
అయితే బీజేపీ మాత్రం హరీష్ రావత్ సర్కారు మైనారిటీలోనే ఉందని ఇప్పటికీ వాదిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపై ఓటింగులో 9 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తుచేస్తోంది. అలాగే, రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మళ్లీ తన గూటికి తెచ్చుకోడానికి వాళ్లకు లంచం ఇవ్వజూపుతూ హరీష్ రావత్ వీడియోలో చిక్కారని, అందులో ఉన్నది తానేనని కూడా ఆయన ఒప్పుకొన్నారని బీజేపీ అంటోంది. పదో తేదీన విశ్వాస పరీక్ష జరగనుండటం, అందులో రెబెల్ ఎమ్మెల్యేలకు ఓటుహక్కు లేకపోవడంతో.. సర్కారు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతానికి రావత్ వెనక ఉన్నారని భావిస్తున్న కాంగ్రెస్ సభ్యులలో ఇంకా ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది.