మా ఆయన నుంచి విడాకులు ఇప్పించండి
పట్నా: అత్తవారింట్లో టాయ్లెట్ నిర్మించనందుకు నిరసనగా ఓ నవ వధువు భర్త నుంచి విడాకులు కోరింది. బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లా కొతవా గ్రామానికి చెందిన అర్చనా గౌతమ్ ఈ నిర్ణయం తీసుకుంది.
మలవిసర్జనకు చీకట్లో ఆరుబయట ప్రదేశానికి వెళ్లడం అవమానంగా ఉందని అర్చన వాపోయింది. అంతేగాక భూమి యజమాని తనను పలుమార్లు అవమానించాడని చెప్పింది. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించాల్సిందిగా తన భర్త బబ్లూ కుమార్కు ఎన్నిసార్లు చెప్పినా వినలేదని అర్చన పంచాయతీ పెద్దల ముందు చెప్పింది. బబ్లూ నుంచి తాను విడిపోతానని, విడాకులు ఇప్పించాలని పంచాయతీ పెద్దలను కోరింది. గత మేలో బబ్లూ, అర్చన వివాహం చేసుకున్నారు. బిహార్లో లక్షలాదిమందికి ఇళ్లలో టాయ్లెట్లు లేవు. టాయ్లెట్లు నిర్మిస్తేనే అత్తగారింటికి వెళ్తామని గతంలో చాలామంది వివాహితులు షరతు పెట్టిన సంఘటనలు ఉన్నాయి.