కరుణానిధి పాత ఫొటోలతో ఆసుపత్రి బయట ఓ అభిమాని
సాక్షి ప్రతినిధి, చెన్నై: మూత్రనాళ ఇన్ఫెక్షన్‌కు చికిత్స పొందుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి శుక్రవారం అర్ధరాత్రి సమయంలో రక్తపోటు ఒక్కసారిగా తగ్గింది. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆసుపత్రికి తరలించారు. ఐసీయూలో ఉంచి నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్సచేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, రక్తపోటు నియంత్రణలోకి వచ్చిందని శనివారం రాత్రి ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. కరుణానిధి కుటుంబ సభ్యులు వెద్యులతో చర్చించారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్, కరుణానిధి కొడుకు స్టాలిన్, కుమార్తె కనిమొళి తదితరులు ఆసుపత్రిలో ఉన్నారు. పార్టీ నుంచి బహిష్కరణకు గురై, కరుణానిధి కుటుంబానికి దూరంగా ఉంటున్న పెద్ద కొడుకు అళగిరి ఆస్పత్రికి తండ్రిని పరామర్శించడానికి వచ్చారు. తమిళనాడు గవర్నర్, రక్షణ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఆజాద్, తమిళనాడు కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ వాస్నిక్ తదితరులు ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేశారు. వైద్య సాయాన్నైనా అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం చెప్పారు. కేరళ ముఖ్యమంత్రి విజయన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్..కరుణానిధి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్‌లు చేశారు. కరుణానిధి నివాసానికి భారీగా అభిమానులు తరలివస్తున్న దృష్ట్యా ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇద్దరు కార్యకర్తల మృతి..
కరుణానిధి అనారోగ్యంపై వ్యాపించిన వదంతులతో ఇద్దరు డీఎంకే కార్యకర్తలు మరణించారు. వాట్సాప్‌లో కరుణ అనారోగ్యంపై జరుగుతున్న దుష్ప్రచారం గురించి విని నామక్కల్ జిల్లా నామగిరిపేటకు చెందిన శివషణ్ముగం (64) గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు. అలాగే, తిరువారూరు జిల్లా ముత్తుపేటకు చెందిన తమీమ్ (55) శుక్రవారం రాత్రి టీవీలో కరుణానిధి అనారోగ్యంపై వచ్చిన వార్తలు వింటూ కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించాడు.
Comments
Please login to add a commentAdd a comment