ఆమె విడుదలపై అప్పీలు చేస్తాం
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను నిర్దోషిగా విడుదల చేస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును తమ పార్టీ సవాలు చేస్తుందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కరుణానిధి తెలిపారు. పార్టీ జిల్లా కార్యదర్శుల సమావేశంలో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యే హక్కు డీఎంకేకు ఉందని సుప్రీంకోర్టు రెండుసార్లు చెప్పిందని, అందుకే తాము అప్పీలు చేద్దామని అనుకుంటున్నామని ఆయన అన్నారు.
ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ బీవీ ఆచార్య, కర్ణాటక అడ్వకేట్ జనరల్ రవివర్మ కుమార్ ఇద్దరూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్లాల్సిందిగా ప్రభుత్వానికి సూచించారని కరుణానిధి చెప్పారు. ఈ కేసులో ముందుగా ఫిర్యాదుచేసిన బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యం స్వామి కూడా అప్పీలువైపే మొగ్గు చూపిస్తుననట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో డీఎంకే ప్రధాన కార్యదర్శి అంబళగన్ కూడా ఓ పిటిషనర్.