
మూడేళ్ల తర్వాత మలిఅడుగు
న్యూఢిల్లీ: బొటానికల్ గార్డెన్ -కాళిందికుంజ్ మధ్య మెట్రో రైలు మార్గం పొడిగింపు ప్రాజెక్టుకు సంబంధించిన అవగాహన పత్రం (ఎంఓయూ)పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (డీఎంఆర్‌సీ), నోయిడా అథారిటీ సంస్థలు బుధవారం సంతకం చేశాయి. స్థానిక మెట్రో భవన్‌లోఎ డీఎంఆర్‌సీ చైర్మన్ మంగూసింగ్ సమక్షంలో ఆ సంస్థ బిజినెస్ డెవలప్‌మెంట్ విభాగం డెరైక్టర్ ఎస్‌డీ శర్మ, నోయిడా అథారిటీ సీఈఓ రమారమణ్‌లు ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ విషయాన్ని డీఎంఆర్‌సీ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ విభాగం కార్యనిర్వహణ అధికారి అనుజ్ దయాళ్ వెల్లడించారు. కాగా బొటానికల్ గార్డెన్ (నోయిడా)-కాళిందికుంజ్ (ఢిల్లీ) మధ్య మెట్రో రైలు మార్గం నిర్మాణానికి సంబంధించినప్రతిపాదన మూడు సంవత్సరాల క్రితమే రూపుదాల్చింది.
ఈ మార్గం మొత్తం పొడవు 3.9 కిలోమీటర్లు. ఈ ప్రతిపాదనకు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ గత జూన్ నెలలో ఉత్తరప్రదేశ్ రాజధాని నగరం లక్నోలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదముద్ర వేసిన సంగతి విదితమే. ఈ మార్గం అందుబాటులోకి వస్తే ప్రయాణికులు హుడా సిటీ సెంటర్-జహంగీర్‌పురి మార్గంలో ప్రయాణించడం కోసం రాజీవ్‌చౌక్ మెట్రో స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. హౌజ్‌ఖాస్, ఎమిటీ విశ్వవిద్యాలయం, కల్కాజీ స్టేషన్ల మీదుగా కాళిందీకుంజ్‌కు చేరుకోవచ్చు. ఈ మార్గ ంలో సగటున 48,500 మంది ప్రతిరోజూ ప్రయాణిస్తారని సంబంధిత అధికారులు అంచనా వేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఢిల్లీ నగరం శివారులోని జాతీయ ప్రాదేశిక ప్రాంత పరిధిలోని బొటానికల్ గార్డెన్ తొలి ఇంటర్‌చేంజ్ స్టేషన్ అవుతుంది.