
మహిళలపై దౌర్జన్యాలు అరికట్టండి
దావణగెరె : రాష్ట్రంలో మహిళలపై దౌర్జన్యాలు, అత్యాచారాలను ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ, ఏబీవీపీ, ఏఐఎంఎస్‌ఎస్ సంఘాలు మంగళవారం ధర్నా నిర్వహించి ఉప విభాగాధికారికి వినతిపత్రం సమర్పించారు. నగరంలోని గాంధీ సర్కిల్‌లో రాస్తారోకో చేసిన ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు మహలింగప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచారాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత వారంలోనే 19 అత్యాచారాలు, ఆత్మహత్య కేసులు నమోదయ్యాయన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్‌ఐ రవికుమార్, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా స్థానిక జయదేవ సర్కిల్‌లో ధర్నా నిర్వహించిన ఏఐఎంఎస్‌ఎస్ కార్యకర్తలు మహిళలపై దౌర్జన్యాలను, అత్యాచారాలను ఖండించారు. ఈ సందర్భంగా జిల్లా సంచాలకులు జ్యోతి కుక్కువాడ మాట్లాడుతూ వృద్ధుల నుంచి చిన్నారుల వరకు అత్యాచారాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని ఇలాంటి ఘటనలను నియంత్రించాలని, లేని పక్షంలో ఉగ్ర పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా శబనం, భారతి, నాగలక్ష్మి, నాగజ్యోతి, లత, నాగస్మిత, సీతమ్మ కాలేజీ సిబ్బంది, చేతన్ తదితరులు పాల్గొన్నారు.
ఏబీవీపీ ఆధ్వర్యంలో..
నగరంలోని ఐటీఐ కాలేజీ నుంచి ఏబీవీపీ నేతృత్వంలో వివిధ కాలేజీ విద్యార్థులు బృహత్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నగరంలో కార్యదర్శి సుహాన్, యూఆర్.సచిన్, వినయ్, విశ్వనాథ్ అణజి, సురేష్, చన్నబసప్ప మాళి, ప్రవీణ్, రాజు, సమర్థ, అమిత్, శృతి, అక్షిత తదితరులు పాల్గొన్నారు.
చిత్రదుర్గం : నగరంలో మహిళలపై దాడిని నిరసిస్తూ మంగళవారం ఏబీవీపీ బృహత్ ర్యాలీ చేపట్టింది. ఈ సందర్భంగా ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ మహిళలు, విద్యార్థినులపై అత్యాచారాలు, దౌర్జన్యాలకు అడ్డుకట్ట వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యతారహితంగా విధులు నిర్వర్తించిందన్నారు. ఇందుకు బాధ్యత వహిస్తూ హోం శాఖ మంత్రి జార్జ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏబీవీపీ పదాధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు.