పాస్ చేయండి సార్.. పెళ్లికి రెడీగా ఉన్నాను!
లక్నో: గతేడాది తరహాలో పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవడంతో ఓ విద్యార్థిని వినూత్నంగా తనను పాస్ చేయాలని కోరింది. యూపీ బోర్డు ఎగ్జామ్స్ కు హాజరైన ఓ విద్యార్థిని తన ఆన్సర్ షీటులో పెళ్లి ప్రస్తావనను తీసుకొచ్చింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. ‘ సార్.. నేను ఓ అమ్మాయిని. వచ్చే జూన్ 28న నా వివాహం జరగనుంది. దయచేసి నన్ను ఈ పరీక్షల్లో పాస్ చేయండి. నేను ఫెయిల్ అయితే మా ఫ్యామిలీ చాలా బాధ పడుతుంది. నా పరిస్థితి అర్థం చేసుకోండి’ అంటూ యూపీ బోర్డు ఎగ్జామ్స్ లో ఓ విద్యార్థిని రాసుకొచ్చింది.
తాను పెళ్లికి సిద్ధంగా ఉన్న సమయంలో పరీక్షలో ఫెయిల్ అయితే చిన్నచూపుగా ఉంటుందని చెబితే పాస్ చేస్తారని తన తెలివితేటలు చూపించింది. చదవకున్నా ఎలాగైనా పాస్ కావాలనే ఉద్దేశంతో ఎగ్జామ్ బోర్డుకు ప్రతి ఏడాది ఇలాంటి సమాధాన పత్రాలు వేలాదిగా వస్తుంటాయని పేపర్లు దిద్దే ఉపాధ్యాయులు చెబుతున్నారు. కొందరు విద్యార్థులైతే నేరుగా 50, 100, 500 నోట్లను ఆన్సర్ షీటుకు జతచేసి లంచం ఇవ్వజూపే వారని చెప్పారు. అయితే గతేడాది తరహా పరిస్థితి ఇప్పుడు లేదని, చదువుకుంటూనే పాస్ అవుతారని, లంచం ఇవ్వచూపాలని చూసినా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఓ ఉన్నతాధికారి విద్యార్థులకు సూచించారు. వీరిని పాస్ చేసినా ఏ సబ్జెక్ట్ లేని కారణంగా ఉద్యోగాల వేటలోనూ వెనుకంజలో ఉండాల్సి వస్తుందన్నారు.