న్యూఢిల్లీ : లోక్సభలో లలిత్ మోదీ అంశం మరోసారి దుమారం రేపింది. విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనతో బుధవారం సభలో గందరగోళం నెలకొంది. దీంతో ఉభయసభలు వాయిదాపడ్డాయి. బుధవారం ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే లలిత్ మోదీ అంశంపై కాంగ్రెస్ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ సుమిత్ర మహాజన్ తిరస్కరించారు. దాంతో కాంగ్రెస్ సభ్యులు నినాదాలు చేస్తూ సభకు అడ్డు పడ్డారు.
ఆ సమయంలో సుష్మ స్వరాజ్ లేచి తాను చర్చకు సిద్ధమేనని..విపక్ష సభ్యులు సభ సజావుగా జరిగేందుకు సహకరించాలని సూచించారు. మరో పక్క పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడు కూడా ప్రభుత్వం లలిత్ మోదీ అంశంపై చర్చకు సిద్ధంగా ఉందని ..విపక్ష సభ్యులు తమ తమ స్థానాల్లో కూర్చుని సభ నడిచేందుకు సహకరిస్తే ప్రభుత్వం చర్చిస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ వాయిదా తీర్మానంపైనే చర్చ జరగాలని పట్టు బట్టారు. వాయిదా తీర్మానాలను పక్కనపెట్టడంతో పాటు అన్నిరకాల కార్యక్రమాలను వాయిదా వేయాలని, నేరుగా చర్చ ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రధాని మోదీని సభకు రప్పించాలని పట్టు బట్టారు. చర్చ సందర్భంగా మోదీ సభలో ఉండాల్సిందేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రధాని సభలో ఉంటేనే చర్చ పై అవగాహన ఉంటుందని..అప్పుడే ఆయన ఏం చర్యలు తీసుకుంటారో తెలుస్తుందని ఖర్గే పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది.
స్పీకర్ సుమిత్రా మహాజన్ జోక్యం చేసుకుని సభలో లేనివారి పేర్లను ప్రస్తావించవద్దని, మోదీ గేట్ లాంటి పదాలను వాడరాదని సభ్యులకు సూచించారు. దాంతో సుష్మ స్వరాజ్ జోక్యం చేసుకుని 'మోదీ గేట్ అంటారా లేక లలిత్ గేట్ అంటారా అననివ్వండి...ముందు చర్చ జరగనివ్వండి' అని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేయటంతో సభా కార్యక్రమాలకు అంతరాయం ఏర్పడింది. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12.30 గంటల వరకూ వాయిదా వేశారు.
'మోదీ గేట్ లాంటి పదాలు వాడొద్దు'
Published Wed, Aug 12 2015 12:46 PM | Last Updated on Sun, Sep 3 2017 7:19 AM
Advertisement