బుల్లెట్ల వర్షం కురుస్తున్నా.. డ్రైవర్ సాహసం
శ్రీనగర్: అమర్‌నాథ్ యాత్రికులపై ఉగ్రమూకలు బుల్లెట్ల వర్షం కురిపిస్తున్నా బస్సు డ్రైవర్ దాదాపు కిలోమీటర్ వరకు నడిపించడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ప్రాణనష్టం సాధ్యమైనంత మేరకు తగ్గించేందుకు ఆయన ధైర్యసాహసాలు ప్రదర్శించినట్లు సమాచారం. యాత్రికుల ప్రాణాలు కాపాడేందుకు డ్రైవర్ బస్సును వేగంగా ముందుకు తీసుకెళ్లారని ఉగ్రదాడిలో గాయపడ్డ మహారాష్ట్రకు చెందిన యాత్రికురాలు భాగ్యమణి తెలిపారు. చనిపోయిన ఏడుగురు యాత్రికులలో తన మరదలు ఉన్నారని కన్నీటి ఆమె పర్యంతమయ్యారు. అమర్‌నాథ్ తర్వాత వైష్ణోదేవి ఆలయాన్ని దర్శించుకోవాలకున్నామని, అంతలోనే ఈ ఘాతుకం జరిగిపోయిందని ఆమె వాపోయారు.
'అమర్‌నాథ్ యాత్ర నుంచి మా బస్సు తిరిగి వెళ్తోంది. బస్సు జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్‌కు సమీపించగానే వాహనంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఉగ్రవాదులు బస్సును చుట్టుముట్టి కాల్పులు జరుపుతున్నా.. ఆ చిమ్మ చీకట్లో మాకు ఏం కనిపించలేదు. అసలు అక్కడ మాకు ఏం జరగబోతుందో అర్థం కాని షాక్‌లో ఉన్నాం. కానీ కాల్పులు మొదలుకాగానే అప్రమత్తమైన మా డ్రైవర్.. ఎంతో ధైర్యంగా వ్యవహరిస్తూ బస్సును కిలోమీటర్ వరకు ముందుకు తీసుకెళ్లారని' అనంతనాగ్ జిల్లా ఆ్పస్పత్రిలో చికిత్స పొందుతున్న యాత్రికురాలు భాగ్యమణి వివరించారు. అమర్‌నాథ్ యాత్రికుల బస్సుపై జరిపిన కాల్పుల్లో ఐదుగురు మహిళలు సహా ఏడుగురు మృతిచెందగా, మరో 32 మంది యాత్రికులు గాయపడ్డ విషయం తెలిసిందే.