
ఖరగ్‌పూర్ : ప్రపంచంలోనే గొప్ప నాగరికతగా భాసిల్లిన సింధునాగరికత అంతరించడానికి గల కారణాన్ని ఐఐటీ ఖరగ్‌పూర్‌కు చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. 900 ఏళ్లపాటు కొనసాగిన కరువు కారణంగానే 4,350 ఏళ్లక్రితం సింధు నాగరికత తుడిచిపెట్టుకు పోయిందని తెలిపారు. రుతుపవనాలు ఆలస్యంగా రావడం వల్ల కరువు వచ్చిందని.. కొన్నేళ్ల తర్వాత తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అక్కడి నుంచి మైదానాలకు వలస వెళ్లారని భౌగోళిక శాస్త్ర ప్రొఫెసర్ కుమార్ గుప్తా పేర్కొన్నారు. వీరంతా గంగా యమునా లోయ గుండా ప్రయాణిస్తూ ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు బెంగాల్, దక్షిణ వింధ్యాచల్, దక్షిణ గుజరాత్‌కు చేరుకున్నారన్నారు. ఇందుకు గల ఆధారాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.
జియోలజీ, జియోఫిజిక్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన పరిశోధకులు.. రుతుపవనాలు సకాలంలో రాకపోవడం వల్ల 5 వేల ఏళ్ల క్రితం వాయువ్య హియాలయాల్లో వర్షభావ పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. దీని వల్ల నదులు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని క్రమంగా అది కరువుకు దారితీసిందని తెలిపారు. ఈ పరిస్థితి 9 వందల ఏళ్ల పాటు కొనసాగడం వల్ల అప్పటివరకు సిరిసంపదలతో వర్థిల్లిన సింధు నాగరికత వైభవం కోల్పోయిందని నివేదికలో పేర్కొన్నారు. వారి పరిశోధనకు ఆధారాలుగా లడఖ్‌లోని మోరిరి సరస్సుకు సంబంధించిన 5 వేల సంవత్సరాల రుతుపవన, శీతోష్ణస్థితి మార్పుల పట్టికను ఐఐటీ బృందం జతచేసింది.
Comments
Please login to add a commentAdd a comment