ఆస్తుల సంపాదన నేరం కాదు
అక్రమంగా సమకూరితేనే నేరం
జయలలిత కేసులో సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: ఆస్తులు సంపాదించడం నేరం కాదని, అవి అక్రమ సంపాదన ద్వారా సమకూరితేనే అది నేరం కిందికి వస్తుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. తమిళనాడు సీఎం జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేసింది. జయను నిర్దోషిగా ప్రకటిస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయడం తెలిసిందే. దీనిపై వేసవి సెలవుల్లో అసాధారణ రీతిలో జస్టిస్ పీసీ ఘోస్, జస్టిస్ అమితవ రాయ్‌ల వెకేషన్ బెంచ్ బుధవారం విచారణ జరిపింది. వెకేషన్‌లో అత్యవసర అంశాలను మాత్రమే విచారణకు స్వీకరించే సుప్రీం.
వేసవి సెలవుల్లో తుది వాదనలను వినాలని నిర్ణయించింది. ఈ కేసు పరిష్కారానికి మూడు మార్గాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. హైకోర్టు తీర్పును సమర్థించడం లేదా తిరస్కరించడం, కేసును తాజాగా విచారించడం లేదామళ్లీ మొదటి నుంచి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించడం అనే మార్గాలున్నాయంది. న్యాయవాది దుష్యంత్ దవే కర్ణాటక ప్రభుత్వవాదనలు వినిపిస్తూ.. హైకోర్టుతీర్పు హేతుబద్ధంగా లేదన్నారు. గిఫ్ట్‌లను ఇచ్చే సంప్రదాయం తమిళనాడులో ఉందని హైకోర్టు చెప్పిన వ్యాఖ్యలను దవే ఖండించారు. రూ.66.65 కోట్ల అక్రమాస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితను దోషిగా తేల్చి నాలుగేళ్ల శిక్ష విధించడంతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించగా, దీన్ని హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.