
న్యూఢిల్లీ: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 9న ఈ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది. 68 నియోజకవర్గాలకు ఒకే దశలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలను డిసెంబర్ 18న ప్రకటించనున్నట్లు స్పష్టంచేసింది. ఆలోపే (డిసెంబర్ 18) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలుంటాయని తెలిపిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకే జోతి.. ఈ ఎలక్షన్స్‌కు షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. ‘ఒక రాష్ట్రంలో ఎన్నికల విధానం వల్ల మరో రాష్ట్రంలో ఎన్నికలు ప్రభావితం కాకూడదు.
అందుకే డిసెంబర్ 18లోపే గుజరాత్ ఎన్నికలుంటాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల నియమావళి తక్షణమే అమల్లోకి వస్తుంది’ అని ఏకే జోతి తెలిపారు. ఎన్నికల నియమావళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వర్తిస్తుంది. తొలిసారిగా హిమాచల్ ప్రదేశ్‌లోని ఒక్కో నియోజకవర్గంలో మహిళల ఆధ్వర్యంలో నడిచే రెండేసి పోలింగ్ కేంద్రాలను (మొత్తం 136) ఏర్పాటుచేయనున్నట్లు సీఈసీ వెల్లడించారు. ‘అక్టోబర్ 16 గెజిట్ నోటిఫికేషన్ విడుదలతో ఎన్నికల ప్రక్రియ మొదలవుతుంది.
ఈ తేదీ నుంచే నామినేషన్లు ప్రారంభం అవుతాయి. అక్టోబర్ 23న నామినేషన్ల ప్రక్రియ ముగుస్తుంది. 24న వీటి పరిశీలన, 26న ఉపసంహరణకు చివరి రోజు’ అని ఏకే జోతి తెలిపారు. ఎన్నికల కమిషనర్లు.. ఓపీ రావత్, సునీల్ అరోరాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నికలకు, ఫలితాలకు మధ్య 40 రోజుల సమయంపై ప్రశ్నించగా.. ‘నవంబర్ చివరి రెండు వారాల్లో భారీగా హిమపాతం ఉంటుంది. అందుకే ముందుగానే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు.
కాంగ్రెస్, బీజేపీ నువ్వా నేనా?
68 అసెంబ్లీ స్థానాలున్న హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు 35 మంది, బీజేపీకి 28 మంది, నలుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలున్నారు. సీఎం వీరభద్రసింగ్ ఏడోసారి సీఎంగా గెలిచేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే.. 2014 పార్లమెంటు ఎన్నికల్లో ఉన్న నాలుగుస్థానాలను కైవసం చేసుకున్న బీజేపీ.. పొరుగున ఉన్న ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల విజయాలతో జోరుమీద కనబడుతోంది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరి 7న, గుజరాత్ అసెంబ్లీకి జనవరి 22న ముగుస్తుంది.
100% ఓటరు ధ్రువీకరణ పత్రాలతో
హిమాచల్ ఎన్నికల్లో అన్ని ఈవీఎంలకు ఓటు ధ్రువీకరణ (వీవీపీఏటీ) యంత్రాలను ఏర్పాటుచేయనున్నట్లు జోతి వెల్లడించారు. రాష్ట్రంలోని 7,479 పోలింగ్ కేంద్రాల్లో వీటిని ఏర్పాటుచేస్తామన్నారు. వీవీపీఏటీ తెర పరిణామాన్ని కూడా కాస్త పెంచనున్నట్లు తెలిపారు. ప్రతి ఓటరుకు ఎన్నికల గుర్తింపు కార్డు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. పోలింగ్ స్లిప్పులతోపాటుగా ఓటరు మార్గదర్శ కరపత్రాన్ని అందజేయనున్నట్లు ఏకే జోతి వెల్లడించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల వ్యయం నిమిత్తం ప్రత్యేక బ్యాంకు అకౌంటును తెరవాల్సి ఉంటుంది. దీంతోపాటుగా ఒక్కో అభ్యర్థి గరిష్టంగా రూ. 28 లక్షల రూపాయలను ఖర్చుచేయొచ్చు. గోవా అసెంబ్లీ ఎన్నికల్లోనూ వందశాతం పోలింగ్ బూతుల్లో వీవీపీఏటీ యంత్రాలను వినియోగించిన సంగతి తెలిసిందే.
గుజరాత్ సర్కారు కోరినందునే!
ఎన్నికల నియమావళి అమల్లోకి రాగానే అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు తక్షణమే ఆగిపోతాయని.. అందుకే గుజరాత్ ఎన్నికల నోటిఫికేషన్ కాస్త ఆలస్యమైందని జోతి వెల్లడించారు. జూలైలో వచ్చిన వరదల పునరావాస కార్యక్రమాలకు ఇబ్బంది కలుగుతున్నందున కొంత సమయం కావాలని గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోరారని జోతి తెలిపారు. సరైన సమయంలోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు. 1993, 1994, 2002లోనూ హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదలైన విషయాన్ని జోతి గుర్తుచేశారు.
మోదీ ఒత్తిడితోనే షెడ్యూల్ ఆలస్యం: కాంగ్రెస్
హిమాచల్ ప్రదేశ్‌తోపాటుగా గుజరాత్ ఎన్నికలకు షెడ్యూల్ వెలువరించకపోవటానికి ఎన్నికల కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వం ఒత్తిడే కారణమని కాంగ్రెస్ ఆరోపించింది. అక్టోబర్ 16న గుజరాత్‌లో పర్యటించనున్న మోదీ.. ఓటర్లకు తాయిలాలు ప్రకటించేందుకే షెడ్యూల్ వాయిదా వేశారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సుర్జేవాలా ఆరోపించారు. ‘వచ్చే గుజరాత్ పర్యటనలో ఓటర్లకు దొంగ వరాలు ప్రకటించాలని మోదీ భావిస్తున్నారు. అందుకే షెడ్యూల్ వాయిదా పడింది. 22 ఏళ్లుగా గుజరాత్‌కు ఏమీ చేయలేని బీజేపీ.. ఓటమికి భయపడే ఇప్పుడు ప్రజలను ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది’ అని సుర్జేవాలా ట్వీటర్‌లో విమర్శించారు. బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి తప్పదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment