ఓటర్లను ప్రలోభపెట్టే అభ్యర్థులపై వేటు!
న్యూఢిల్లీ: తమిళ నాడులోని ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడంలో సరి కొత్త ఆలోచనలు చూసిన తర్వాత అలా ప్రలోభ పెట్టే అభ్యర్థుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయించింది. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటే చేసే అభ్యర్థులు ఓటర్లను డబ్బు, ఇతర కానుకలతో ప్రలోభపెట్టినట్లు కోర్టులో చార్జిషీట్ దాఖలైతే సదరు అభ్యర్థులపై ఐదేళ్ల వరకు అనర్హత వేటు వేసేలా ప్రజాప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరనుంది. దీనిపై న్యాయ శాఖకు లేఖ రాస్తున్నామని ఈసీ అధికారవర్గాలు తెలిపాయి.
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో ఓటర్లకు పాల టోకన్లు, ఫోన్ రీచార్జ్ కూపన్లు, పేపర్ల చందాలు, ఖాతాల్లోకి డబ్బు ట్రాన్స్‌ఫర్, మొబైల్ వాలెట్ పేమెంట్ల రూపంలో అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టినట్లు ఈసీ గుర్తించింది. ఎన్నికల్లో డబ్బు దుర్వినియోగం అయితే ఆ ఎన్నికలను రద్దు చేసేలా అధికారాలు ఇవ్వాలని గతంలోనే ఈసీ ప్రభుత్వాన్ని కోరింది. ప్రస్తుతం ఎన్నికల్లో అంగ బలం ప్రదర్శించిన సమయంలో ఈసీకి నేరుగా ఆ ఎన్నికను రద్దు చేసే అవకాశం ఉంది. అర్థ బలం విషయంలో రాజ్యాంగ అధికారాల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు కానీ, వాటితో అవసరం లేకుండానే చర్యలు తీసుకోవాలని ఈసీ భావిస్తోంది.