ఈడీకి మోదీ షాక్
ముంబై: ఐపీఎల్ స్కామ్స్టర్ లలిత్ మోదీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కు షాకిచ్చాడు. గతవారం తాము జారీచేసిన సమన్లను మోదీ తిప్పిపంపారని ఈడీ అధికారులు మంగళవారం వెల్లడించారు. అయితే అది నిజంకాదని, ఇప్పటివరకు తమకు ఎలాంటి సమన్లు అందలేదని మోదీ తరఫు న్యాయవాది మహమ్మద్ ఎం అబ్దీ చెప్పుకొచ్చారు.
ఐపీఎల్‌లో దాదాపు రూ.1700 కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మోదీ.. 2008లో ఐపీఎల్ టీవీ ప్రసార హక్కుల విక్రయాలకు సంబంధించిన రూ. 425 కోట్ల చెల్లింపుల విషయంలో అక్రమాలకు పాల్పడ్డాడని ఈడీ నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలోనే మూడువారాల్లోగా తన ఎదుట విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులు జరీచేసింది.
కాగా, ఈ సమన్లు తీసుకునేందుకు తాను అర్హుడినికానంటూ మోదీ తరఫు న్యాయవాది సమన్లను తిప్పిపంపారని ఈడీ అధికారులు చెప్పారు. దీనిని కొట్టిపారేసిన అబ్దీ.. తనకు ఎలాంటి సమన్లు అందలేదని స్పష్టం చేశారు. 'ఈడీ అధికారుల తీరు మరీ విడ్డూరంగా ఉంది. ప్రస్తుతం లలిత్ నివసిస్తోన్న లండన్ అడ్రస్ వారికి తెలుసు. నిబంధనల ప్రకారం సమన్లు ఎలా పంపుతారో వారికి తెలియదా' అని అబ్దీ వ్యాఖ్యానించారు.