గౌహతి: అసోంలో అమానుషం చోటు చేసుకుంది. చేతబడి నెంపతో గ్రామస్తులంతా కలిసి అరవైమూడేళ్ల వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. సోనిత్ పూర్జిల్లాలోని ఓ గిరిజన గ్రామంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళితే స్థానిక దేవాయలంలో దేవుని ప్రతినిధిగా, అమ్మగా చలామణిలో ఉన్న అనిమా రోఘంటి (35) అనే మహిళ ఈ ఘాతుకానికి పురికొల్పింది.
ఓరంగ్ అనే ఆదివాసీ వృద్ధురాలి వల్ల గ్రామానికి చెడు జరగబోతోందని చెప్పింది. ఆమె చేతబడులు చేస్తోందని గ్రామస్తులను నమ్మబలికింది. దీంతో ఆగ్రవేశాలతో ఊగిపోయిన జనం..వృద్ధురాలిని ఇంటినుంచి బైటికి లొక్కొచ్చారు. సుమారు 200 మంది గ్రామస్తులు ఆమెను చుట్టుముట్టారు. నడివీధిలో పట్టపగలు నగ్నంగా ఊరేగించారు. గ్రామం నడిబొడ్డులో నిర్దాక్షిణ్యంగా తలనరికి వేశారు. కాగా అనిమా చెప్పిన జోస్యం ఆధారంగా గ్రామస్తులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారని ఎస్పీ సమద్ హుస్సేన్ తెలిపారు. అనిమా భర్తతో పాటు నలుగురు కుటుంబ సభ్యులు, మరికొంతమంది గ్రామస్తులపై కేసు నమోదు చేశారు. మొత్తం ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కాగా అసోంలో గత అయిదేళ్లలో వందమందికికి పైగా మహిళలను చేతబడి చేస్తున్నారనే అనుమానంతో హతమార్చిన ఘటనలు నమోదు చేసుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పెచ్చుమీరుతున్న మూఢనమ్మకాలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ముందని ప్రజా సంఘాలు వాదిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివాసీ, గిరిజన గ్రామాల్లో అవగాహనా సదస్సులను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేతబడులకు వ్యతిరేకంగా చట్టం చేయాలనే ఆలోచనలో ఉంది.