
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: ఏప్రిల్ 2న పదవీకాలం ముగియనున్న రాజ్యసభ స్థానాలకు మార్చి 23న జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ వెల్లడించింది. రెండేళ్ల రాజ్యసభ పదవీకాలం ముగియనున్న సభ్యులతోపాటు.. ఇటీవల సభ్యత్వానికి రాజీనామా చేసిన, మృతిచెందిన సభ్యుల ఖాళీలను కలుపుకుని 17 రాష్ట్రాల్లో మొత్తం 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది. మార్చి 5న నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఎన్నికల తర్వాత రాజ్యసభలో బీజేపీ బలం పెరగనుంది. 58 స్థానాలు ఏప్రిల్ 2న ఖాళీ అవనుండగా.. కేరళ ఎంపీ వీరేంద్ర కుమార్ గతేడాది డిసెంబర్‌లో రాజీనామా (ఏప్రిల్ 2022 వరకు సమయం ఉన్నప్పటికీ) చేసిన సంగతి తెలిసిందే.
ఏపీ, తెలంగాణల్లో..
సంయుక్త ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 18 రాజ్యసభ స్థానాలుండగా.. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి 11కు, తెలంగాణకు 7 సీట్లను లాటరీ పద్ధతిలో నిర్ణయించారు. ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ జాబితా ప్రకారం.. ఏప్రిల్ 2 తర్వాత ఏపీ నుంచి ముగ్గురు ఎంపీల (దేవేందర్ గౌడ్, రేణుక చౌదరి, చిరంజీవి) పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల (సీఎం రమేశ్, రాపోలు ఆనంద భాస్కర్) సభ్యత్వం ముగియనుండగా.. జూలై 2017న పాల్వాయి గోవర్ధన్ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన స్థానాన్ని ఇంతవరకు భర్తీ చేయలేదు.
జాబితాలో మహామహులు..
పదవీకాలం ముగుస్తున్న సభ్యుల్లో కేంద్ర మంత్రులు జైట్లీ, రవిశంకర్ ప్రసాద్, ధర్మేంద్ర ప్రధాన్, జేపీ నడ్డా, థావర్‌చంద్ గెహ్లాట్, రాందాస్ అథావలే తదితరులున్నారు. కాంగ్రెస్‌తోపాటు పలు ప్రాంతీయ పార్టీనుంచి కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఈ జాబితాలో ఉన్నారు. కాగా, ఉత్తరప్రదేశ్‌లో ఖాళీ కానున్న 10సీట్లలో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోనుంది. యూపీ (10 స్థానాలు), బిహార్, మహారాష్ట్ర (చెరో ఆరు), పశ్చిమబెంగాల్, మధ్యప్రదేశ్ (ఐదేసి), కర్ణాటక, గుజరాత్ (తలో నాలుగు) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్తాన్ (చెరో మూడు), జార్ఖండ్‌లో రెండు, ఛత్తీస్‌గఢ్, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, కేరళలో ఒకటి చొప్పున మొత్తం 59 స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment