
సాక్షి, న్యూఢిల్లీ : ఫేస్‌బుక్‌లో ఓటరు అవగాహనా కార్యక్రమాలు చేపట్టడంపై ఎన్నికల కమిషన్ (ఈసీ) పునరాలోచించనుంది. శుక్రవారం సాయంత్రం జరిగే ఈసీ ఉన్నతాధికారుల భేటీలో ఈ అంశం ప్రధానంగా చర్చకు రానుంది. ఫేస్‌బుక్‌లో డేటా ఉల్లంఘనలు చోటుచేసుకోవడం, ఈ సమాచారాన్ని ఇతర దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేందుకు కేంబ్రిడ్జి ఎనలిటికా వంటి సంస్థలు ఉపయోగించడం వంటి అంశాలతో ఈసీ ఆందోళన చెందుతున్నట్టు సీఈసీ పేర్కొంది.
ఎన్నికలపై ప్రతికూల ప్రభావం చూపేలా ప్రజాభిప్రాయాన్ని మలిచే ప్రయత్నాలు ఆందోళనకరమని..దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్ స్పష్టం చేశారు. ఈసీ భేటీలో దీనిపై విస్తృతంగా చర్చిస్తామని ఆయన పేర్కొన్నారు. ఓటరు అవగాహనా కార్యక్రమాలకు సంబంధించి ఈసీ ఇప్పటివరకూ సోషల్ మీడియాలో చురుకుగా ప్రచారం చేపడుతోంది. యువ ఓటర్ల నమోదు, వారు ఓటు హక్కు వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు ఈ వేదిక శక్తివంతమైందిగా ఈసీ భావిస్తోంది. రాష్ట్రాల్లో కూడా ఈసీ అధికారులు ఫేస్‌బుక్‌ను ఓటరు అవగాహనా ప్రచారానికి ఉపయోగిస్తున్నారు.