వడ్డనకు రెడీ
సాక్షి, చెన్నై: ప్రజలు వ్యతిరేకిస్తున్నా, విద్యుత్ చార్జీల వడ్డనకు ఆ శాఖ సిద్ధం అయింది. చార్జీల పెంపు జాబితాను సిద్ధం చేసిన విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రభుత్వ ఆమోదానికి పంపింది. మరో రెండు మూడు రోజుల్లో ప్రభుత్వ ఆమోదంతో ఈ నెలలోనే కొత్త చార్జీలను వడ్డించేందుకు విద్యుత్ శాఖ పరుగులు తీస్తోంది. అన్నాడీఎంకే సర్కారు అధికారంలోకి వచ్చాక, చతికిలబడ్డ విద్యుత్‌రంగ సంస్థల బలోపేతం, విద్యుత్ సంక్షోభానికి పరిష్కారం నినాదంతో ప్రజల నడ్డి విరిచే పనిలో పడింది. ఇప్పటికే ఓ మారు చార్జీల్ని వడ్డించింది. దీనిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత బయలుదేరినా, చివరకు అది నీరుగారింది. అయినా, విద్యుత్ సంస్థలు నష్టాల్లోనే ఉన్నాయని ప్రకటిస్తూ, విద్యుత్ సంక్షోభం నుంచి పూర్తిగా గట్టెక్కే ప్రయత్నాలు వేగవంతం చేస్తున్నామన్న నినాదంతో మళ్లీ చార్జీల వడ్డనకు సిద్ధం అయింది. ప్రతి ఏటా రాష్ట్ర విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ విద్యుత్ రంగ సంస్థల్లో లాభ నష్టాలను పరిశీలించడం సహజం. అయితే, ఈ ఏడాది రూ.39,818 కోట్ల మేరకు అదనపు భారం పడనుండడాన్ని పరిగణనలోకి తీసుకుని చార్జీల మోతకు నిర్ణయించింది. చెన్నై, తిరునల్వేలి, ఈరోడ్ వేదికగా ప్రజాభిప్రాయ సేకరణ చేసింది. అన్ని చోట్ల ప్రజలందరూ మూకుమ్మడిగా చార్జీల వడ్డనను వ్యతిరేకించినా, ఈ అభిప్రాయ సేకరణ కేవలం లాంఛనమేనన్నది మరో మారు రుజువు అయింది.
పెంచక తప్పదు: అభిప్రాయ సేకరణలతో ప్రజా సంఘాలు, రాజకీయపార్టీలు, మేధావులు, ప్రజలు చార్జీల వడ్డనను తీవ్రంగానే వ్యతిరేకించారు. ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో, పాల ధర మోత మోగించిన వేళ విద్యుత్ చార్జీల వడ్డన సరైన నిర్ణయం కాదని సూచించాయి. అయితే, వాటితో తమకేమి పని, తమ పని తమది అన్నట్టుగా విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వ్యవహరించే పనిలో పడింది. ప్రజాభిప్రాయాన్ని పక్కన పెట్టి చార్జీల వడ్డనకు సిద్ధం అయింది. ఇందుకు సంబంధించిన కార్యాచరణతో నివేదికను సిద్ధం చేసి ప్రభుత్వ అనుమతికి పంపింది. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వ రాయితీ ఏమేరకు ఉంటుందో, దాన్ని బట్టి కొత్త చార్జీల్ని అమలు చేయనున్నారు. ప్రభుత్వానికి పంపిన జాబితా మేరకు రెండు నెలలకుగాను వంద యూనిట్ల వరకు యూనిట్‌కోరూపాయి మేరకు పెరిగింది. ఇక, ఆపై యూనిట్లకు చార్జీల మోత మోగనుంది. అయితే, 500 యూనిట్లకు పైగా వినియోగించే వారికి ప్రభుత్వ రాయితీ వర్తించదు. ఈనెల నుంచి చార్జీల వడ్డన అమలు లక్ష్యంగా విద్యుత్ శాఖ కసరత్తుల్లో పడింది. రెండు నెలలకు గాను విద్యుత్ చార్జీల లెక్కింపు గత నెల పూర్తి అయింది. ఇక కొత్త లెక్కింపు డిసెంబరులో చేస్తారు. ఈ దృష్ట్యా, ఈ నెల నుంచి చార్జీల అమలు ద్వారా లెక్కల్లో తేడా ఉండదన్న నిర్ణయానికి అధికారులు రావడం గమనార్హం.
చార్జీల పెంపు జాబితా:
యూనిట్ పాత చార్జీ కొత్త చార్జీ
ఇళ్లకు
0-100 2.00 3.00
0-200 2.80 3.25
200-500 4.00 4.60
500+ 5.75 6.60
దుకాణాలు:
ఒక యూనిట్: 7.00 8.05
పరిశ్రమలు:
ఒక యూనిట్ 5.50 7.22
తాత్కాలిక కనెక్షన్ 10.50 12.00