రూ. 43వేల కోట్లతో ‘దీనదయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన’కు కేంద్ర కేబినెట్ ఆమోదం
రాజీవ్‌గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన స్థానంలో కొత్త పథకం
రూ. 32,612కోట్లతో పట్టణాల్లో ప్రసార, పంపిణీల పటిష్టతకు పథకం
విద్యుత్, రైల్వే, పర్యాటక రంగాల్లో సార్క్ దేశాలతో 3 ఒప్పందాలకు ఓకే
ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ మెరుగుదలకు రూ. 5,200కోట్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కోసం రూపొందించిన గ్రామీణ విద్యుదీకరణ పథకాన్ని కేంద్రం ఆమోదించింది. రూ 43,033 కోట్లతో రూపొందించిన దీనదయాళ్ ఉపాద్యాయ గ్రామజ్యోతి యోజన (డీడీయూజీజేవై)కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. గతంలో యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ గాంధీ గ్రామీణ విద్యుదీకరణ యోజన (ఆర్‌జీజీవీవై) స్థానంలో ఈ కొత్తపథకాన్ని రూపొందించారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థను పటిష్ట పరుస్తారు. విద్యుత్ పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లకు, ఫీడర్లకు మీటరింగ్ సదుపాయం కూడా కల్పిస్తారు.
ఇక పట్టణ ప్రాంతాల్లో విద్యుత్ ప్రసార, పంపిణీ వ్యవస్థల పటిష్టతకు రూ. 32,612కోట్లతో రూపొందించిన సమగ్ర విద్యుత్ అభివృద్ధి పథకం (ఐపీడీఎస్) కూడా గురువారం కేంద్రమంత్రివర్గ ఆమోదం పొందింది. వివిధ అంశాలపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయాలను కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వెల్లడించారు.
డీడీయూజీజేవై పథకం కింద వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ సరఫరా కోసం విడివిడిగా విభాగాలు ఏర్పాటుచేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ, వ్యవసాయేతర వినియోగదారులకు సక్రమంగా విద్యుత్ సరఫరాకోసం విడివిడిగా ఫీడర్లను ఏర్పాటుచేస్తారని మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు. వ్యవసాయ, వ్యవసాయేతర విద్యుత్ సరఫరాకోసం మొత్తంగా ఈ పథకానికి రూ. 43,033కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మొత్తంలో రూ. 33,453కోట్లు బడ్జెట్ కేటాయింపుల ద్వారా ప్రభుత్వం సమకూర్చవలసి ఉంటుంది.
ఇక గత ప్రభుత్వ కాలంనుంచి ఇప్పటివరకూ అమలులో ఉన్న ఆర్‌జీజీవీవై పథకంకింద మిగిలిన పనులు పూర్తిచేయడానికి 2022వరకూ రూ. 39,275 కోట్ల వ్యయానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం (సీసీఈఏ) ఆమో దం తెలిపింది. ఇందులో రూ. 35,447కోట్లను బడ్జెటరీ కేటాయింపుల ద్వారా అందిస్తారు.
► డీడీయూజీజేవై పథకం ద్వారా గ్రామాల్లో విద్యుత్ సరఫరా మెరుగుదల, రద్దీసమయాల్లో విద్యుత్ వినియోగంపై ఒత్తిడి తగ్గడం వంటి ప్రయోజనాలుంటాయని భావిస్తున్నారు.
► ఈ పథకం కింద ప్రాజెక్టుల మంజూరు ప్రక్రియ తక్షణం మొదలవుతుంది. మంజూరు పూర్తికాగానే, ప్రాజెక్టుల అమలుకు ఆయా రాష్ట్రప్రభుత్వాల పంపిణీ సంస్థలు, విద్యుత్ శాఖలు ఆమోదం తెలుపుతాయి. ఆమోదించిన నాటినుంచి 24నెలల్లోగా ప్రాజెక్టు పనులు పూర్తవుతాయి.
► ఈశాన్య రాష్ట్రాల్లో విద్యుత్ సరఫరా వ్యవస్థ మెరుగుదలకు రూ. 5,200కోట్లతో ఒక పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనితో అస్సాం, మేఘాలయ, మిజోరాం, త్రిపుర, నాగాలాండ్ రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుంది. ప్రపంచ బ్యాంక్ రుణాలు, విద్యుత్ మంత్రిత్వ శాఖ కేటాయింపులతో 50:50 నిష్పత్తితో ఈ పనులు చేపడతారు.
సార్క్ దేశాలతో మూడు ఒప్పందాలు
దక్షిణాసియా దేశాల ప్రాంతీయ సహకార సంఘం (సార్క్) శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం నేపాల్ వెళ్లనున్న నేపథ్యంలో సార్క్ సభ్యదేశాలతో విద్యుత్, పర్యాటక, రైల్వే రంగాల్లో ప్రభుత్వం కుదుర్చుకోనున్న మూడు కీలక ఒప్పందాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైలు, రోడ్డు మార్గాల అనుసంధానాన్ని మరింత మెరుగుపరుచుకునేందుకు, ప్రాంతీయ విద్యుత్ గ్రిడ్ ఏర్పాటుకు ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు.
పల్లెలకు విద్యుత్ వెలుగులు
Published Fri, Nov 21 2014 1:46 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM
Advertisement
Advertisement