
ప్రధాని మోదీపై విరుచుకుపడ్డ లాలూ
పట్నా: ఆర్జేడీ చీఫ్, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే దేశంలో ఎమర్జెన్సీ నాటి రోజులను తలపిస్తున్నాయని ఆయన అన్నారు. 'ప్రధాని మోదీ ఏ విధమైన ప్రజాస్వామ్యాన్ని రూపొందిస్తున్నారు?' అంటూ లాలూ ఈ మేరకు ట్విట్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల మనోభావాలను విస్మరించరాదని ఆయన అన్నారు. దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితుల తరహాలో కేంద్రం వ్యవహరిస్తోందని లాలూ ధ్వజమెత్తారు.
ఆత్మహత్య చేసుకున్న ఆర్మీ మాజీ జవాను కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని పోలీసులు నిర్భందించటాన్ని లాలూ తప్పుపట్టారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడినవారిని కేంద్రం టార్గెట్ చేసుకొని వేధింపులకు పాల్పడుతోందన్నారు. ప్రజల చేత ఎన్నకోబడ్డ ముఖ్యమంత్రిని అడ్డుకోవటం రాజ్యాంగాన్ని అతిక్రమించినట్లేనని లాలూ అన్నారు.