
ఇంజనీర్ల హత్య కేసులో మున్నీదేవి అరెస్ట్
దర్భాంగ: ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అనుచరులు, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ల మధ్య మాటల యుద్ధానికి కారణమైన ఇంజనీర్ల జంట హత్యల కేసులో బిహార్ పోలీసులు పురోగతి సాధించారు. ఇంజనీర్ల హత్యతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై గ్యాంగ్ స్టర్ సంతోశ్ ఝా సోదరి, బహేరీ ప్రాంత నాయకురాలైన మున్నీదేవీ సహా ఆమె భర్త సంజయ్ లాల్డియోలను శనివారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్టయిన గ్యాంగ్ స్టర్ సంతోశ్ ఝా గయా జైలులో ఉన్నాడు. అతడి నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా మున్నీదేవీ, ఆమె భర్తలను లహేరియాసరై పట్టణంలో అరెస్టు చేశామని దర్యాప్తు అధికారి అంజనీ కుమార్ సింగ్ తెలిపారు. ఓ ప్రైవేట్ నిర్మాణ సంస్థలో ఇంజనీర్లుగా పనిచేస్తున్న బ్రజేశ్ కుమార్, ముకేశ్ కుమార్ లను డిసెంబర్ 26న పట్టపగలు గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపిన సంఘటన బీహార్ సహా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.
ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇంజనీర్ల హత్యలు చోటుచేసుకున్నాయని, శాంతిభద్రతల పర్యవేక్షణలో నితీశ్ సర్కార్ విఫలమైందని ఆర్జేడీ చీఫ్ లాలూ యాదవ్ విమర్శించారు. దీనికి ప్రతిగా జేడీయూ శ్రేణులు కూడా లాలూకు ఘాటుగా సమాధానమిచ్చారు. దీంతో మహాకూటమిలో లుకలుకలు మొదటయినట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. అయితే ఇంజనీర్ల హత్యకు అసలు కారణం బలవంతపు వసూళ్లేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అడిగినంత డబ్బు ఇవ్వనందుకే సదరు నిర్మాణ సంస్థకు చెందిన ఇంజనీర్లను గ్యాంగ్ స్టర్లు చంపేసి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఆ క్రమంలోనే లోకల్ పోలీసులు గ్యాంగ్ స్టర్ సంతోశ్ ఝాను అరెస్టు చేశారు. తాజాగా గ్యాంగ్ స్టర్ సోదరి, ఆమె భర్తల అరెస్టుతో దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లయింది.