ఈఎస్‌ఐ వేతన పరిమితి 21 వేలు
కొత్తగా 50 లక్షల మంది కార్మికులకు చోటు: దత్తాత్రేయ
- ఆరోగ్య బీమా ప్రవేశ పరిమితి రూ. 21 వేలకు పెంపు
న్యూఢిల్లీ: ఉద్యోగుల ప్రభుత్వ బీమా సంస్థ (ఈఎస్‌ఐసీ) తన ఆరోగ్య బీమాను మరింత సంఘటితం చేసేందుకు.. బీమాలో చేరటానికి నెల వారీ వేతన పరిమితిని ప్రస్తుతమున్న రూ. 15,000 నుండి రూ. 21,000కు పెంచాలని నిర్ణయింది. ఈ విషయాన్ని కేంద్ర కార్మికమంత్రి బండారు దత్తాత్రేయ మంగళవారం ఢిల్లీలో ఈఎస్‌ఐసీ బోర్డు భేటీ అనంతరం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు. ఈఎస్‌ఐసీ బోర్డుకు కార్మికమంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. బోర్డు భేటీలో ఈఎస్‌ఐసీ వేతన పరిమితిని రూ. 25,000 కు పెంచాలని సంస్థ ప్రతిపాదించినప్పటికీ.. రూ. 21,000 గా నిర్ణయించింది. ధరల పెరుగుదల, వేతనాల పెంపును దృష్టిలో పెట్టుకుని ఈ పెంపు చేపట్టామని.. ఇది 50 లక్షల మంది కార్మికులను ఈఎస్‌ఐసీకి కలిపేందుకు దోహదపడుతుందని దత్తాత్రేయ చెప్పారు.
ఒక్కో ఉద్యోగి నలుగురు సభ్యుల కుటుంబమని భావించినట్లయితే.. రెండు కోట్ల మంది ప్రజలు కొత్తగా ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని చెప్పారు. ప్రస్తుతం ఈ సంస్థలో 2.6 కోట్ల మంది బీమా కార్మికులు ఉన్నారు. పది కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య బీమా కవరేజీ అందిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల వ్యవసాయేతర నైపుణ్యంలేని కార్మికుల కనీస వేతనాన్ని 42 శాతం మేర పెంచి రోజుకు రూ. 350 చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈఎస్‌ఐసీ వేతన పరిమితిని 40 శాతం పెంచింది. ఈఎస్‌ఐసీకి ఉద్యోగ సంస్థ కార్మికుని వేతనంలో 4.7 శాతాన్ని చందాగా అందించాల్సి ఉంటుంది. కార్మికుల వేతనం నుంచి 1.75 శాతం ఈఎస్‌ఐసీ చందా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా నిర్ణయం ప్రకారం.. నెలకు రూ. 21,000 వరకూ వేతనం పొందుతున్న కార్మికులు అనారోగ్యం, ప్రసూతి, వైకల్యం, పనిలో గాయాల వల్ల మరణం వంటి కేసులకు చికిత్స పొందేందుకు అర్హులు. అలాగే పదవీ విరమణ నిధి సంస్థ అయిన ఈపీఎఫ్‌ఓ ఖాతాదారులకూ వేతన పరిమితిని పెంచాలన్న ప్రణాళిక ఉందని.. సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (సీబీటీ) తదుపరి సమావేశంలో దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చునని దత్తాత్రేయ తెలిపారు. కాగా టెలీమెడిసిన్ తొలి దశను దత్తాత్రేయ మంగళవారం ప్రారంభించారు.