సొంతూళ్లకు వెళ్లేందుకు అహ్మదాబాద్ స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్న యూపీ ప్రజలు
అహ్మదాబాద్: దాడుల భయం నేపథ్యంలో హిందీ మాట్లాడే వలసదారులు గుజరాత్‌ను వీడుతుండటం కొనసాగుతోంది. మంగళవారం కూడా హిందీ భాషీయులు గుజరాత్ నుంచి బిహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని తమ సొంత ప్రాంతాలకు భారీ సంఖ్యలో వెళ్లిపోయారు. ఇప్పటికే గుజరాత్ నుంచి 60 వేల మందికిపైగా హిందీ వాళ్లు తమ సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయి ఉంటారని అంచనా. హిందీ వలసదారుల్లో భయం పోగొట్టడానికి పారిశ్రామిక ప్రాంతాల్లో పోలీసులు గస్తీ పెంచారు. వందలాది మంది పోలీసులు వడోదరలో కవాతు నిర్వహించి వలసదారులకు భరోసానిచ్చారు.
హిందీ భాషీయులపై దాడులకు పాల్పడిన 533 మందిని అరెస్టు చేసి 61 కేసులు నమోదు చేశామని గుజరాత్ హోం శాఖ మంత్రి జడేజా చెప్పారు. సామాజిక మాధ్యమాల్లో విద్వేషపూరిత పోస్ట్‌లు చేసిన మరో 20 మందిని ఐటీ చట్టం కింద అరెస్టు చేశామన్నారు. అహ్మదాబాద్ రైల్వే స్టేషన్‌లో ఓ వలసదారుడు మాట్లాడుతూ ‘కొంతమంది నిన్న రాత్రి మా దగ్గరకు వచ్చి మేమంతా మా సొంత రాష్ట్రాలకు వెళ్లిపోవాలనీ, లేకుంటే దాడులు చేస్తామని బెదిరించారు’ అని తెలిపాడు. సబర్‌కాంఠా జిల్లాలో 14 నెలల బాలికపై అత్యాచారం చేశాడనే ఆరోపణలపై బిహార్ నుంచి వచ్చిన ఓ కూలీని పోలీసులు అరెస్టు చేసిన అనంతరం గుజరాత్‌లోని పలు జిల్లాల్లో హిందీ మాట్లాడేవారిపై దాడులు జరుగుతుండటం తెలిసిందే.
కాంగ్రెస్సే కారణం: బీజేపీ
కాంగ్రెస్ ఎమ్మెల్యే అల్పేశ్ ఠాకూర్, ఆయనకు చెందిన గుజరాత్ క్షత్రియ–ఠాకూర్ సేననే ఈ హింసకు కారణమని బీజేపీ ఆరోపించింది. ‘కాంగ్రెస్సే హింసను రగిలిస్తుంది. ఆ హింసను పార్టీ అధ్యక్షుడు రాహుల్ ఖండిస్తారు’ అంటూ సీఎం రూపానీ ట్వీట్ చేశారు.
రాహుల్ అంతకుముందు మాట్లాడుతూ దేశంలో నిరుద్యోగం వల్ల యువతలో పెరుగుతున్న అసహనమే దాడులకు కారణమనీ, జనాభాకు తగ్గట్టుగా ఉద్యోగాలు కల్పించలేకపోవడం ప్రభుత్వ అసమర్థతేనని విమర్శించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాట్లాడుతూ ‘ఈ దాడుల ధోరణి ప్రమాదకరం. ఇదో విపత్కర పరిస్థితి. సమస్య చాలా తీవ్రంగా ఉంది. బీజేపీ ప్రభుత్వం ఎందుకు నియంత్రణ చర్యలు చేపట్టడం లేదో నాకు అర్థం కావడం లేదు’ అని పేర్కొన్నారు.
పారిశ్రామిక రంగంపై ప్రభావం
వేలాది మంది వలస కార్మికులు గుజరాత్‌ను వీడి వెళ్లిపోతుండటంతో మౌలిక సదుపాయాలు, నిర్మాణ, ఔషధ రంగాల్లో మానవ వనరుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. కార్మికులు దొరకక భారీ స్థాయిలో ఉత్పత్తి నష్టం వాటిల్లుతోంది. ఔషధ రంగానికి బాగా ప్రముఖంగా ఉన్న గుజరాత్‌లో దాదాపుగా 3,300 ఔషధ తయారీ కేంద్రాలు ఉన్నాయి.
ఫార్మా ఎగుమతుల్లో 28% వాటా గుజరాత్‌దే. వలస కార్మికులు ఎక్కువగా పనిచేసే ఫాక్టరీలు వారి భద్రత కోసం ఇప్పటికే పలు చర్యలు తీసుకున్నాయి. అంతేకాదు ఇప్పటికే రాష్ట్రం విడిచి వెళ్లిపోయిన వారు వెనక్కి వచ్చేలా చర్యలు కూడా చేపడుతున్నట్టు మానవ వనరుల మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment