కన్నీళ్లు పెట్టిన ఎంపీ
లక్నో: తాను సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్నానని ఆ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ములాయం సోదరుడు, రాజ్యసభ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ తెలిపారు. అధికారికంగా పనిచేయనప్పటికీ పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా భావిస్తున్నానని చెప్పారు. ఇటావాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని అన్నారు. స్వప్రయోజనాల కోసం పాకులాడలేదని పేర్కొన్నారు. తాను ఎటువంటి తప్పు చేయలేదని ప్రజలు అనుకుంటే, తనకు న్యాయం చేయాలని కోరారు. విలేకరుల సమావేశంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు.
బీజేపీతో చేతులు కలిపి సమాజ్ వాదీ పార్టీని బలహీనం చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో రాంగోపాల్ యాదవ్ ను బహిష్కరించారు. అఖిలేశ్ యాదవ్ సర్కారు ఇమేజ్ ను దెబ్బీయడానికి ప్రయత్నించారని ఆరోపణలు వచ్చాయి. ములాయం కుటుంబ వివాదంలో అఖిలేశ్ కు మద్దతుగా ఆయన నిలబడ్డారు. కాగా, రాజ్యసభలో ఎస్పీ నేతగా రాంగోపాల్ స్థానంలో మరొకరిని నియమించేందుకు ములాయం సింగ్ కసరత్తు ప్రారంభించారు.