రైల్వే స్టేషన్లో బాంబుల బ్యాగులు
జైపూర్: రాజస్థాన్లో బాంబుల బ్యాగులు కలకలం సృష్టించాయి. కోటా సిటీలోని రైల్వే స్టేషన్లోని ఓ ప్లాట్ఫాంపై అనుమానాస్పదంగా రెండు బ్యాగులను గుర్తించారు. దీంతో వాటిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. 'కోటా సిటీలోని రైల్వే ప్లాట్ఫాం నెంబర్ 1పై దొరికిన రెండు బ్యాగుల్లో 2.75కేజీల పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, డిటోనేటర్లు లభించాయి' అని అక్కడి పోలీసులు తెలిపారు.
పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు రెండు వేర్వేరు బ్యాగుల్లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. మంగళవారం సాయంత్ర 4.30గంటల ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ఆ పేలుడు పదార్థాలు ఎలాంటివి అనే విషయంలో వివరణ మాత్రం ఇవ్వలేదు. శరవేగంగా బాంబ్ స్క్వాడ్ టీం స్పందించడంతో ఎలాంటి ప్రమాద ఘటన చోటుచేసుకోలేదు. ఢిల్లీ, ముంబయి వంటి సుదూర ప్రయాణాలు చేసేందుకు రాజస్థాన్లో ఇదే ప్రముఖ రైల్వే స్టేషన్.