Kota city
-
రెండు ఆత్మహత్యలు.. మేమిక్కడ ఎందుకు ఉండాలి?
ఇక్కడ రెండు ఆత్మహత్యలు జరిగాయి. మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? - ఓ విద్యార్థి వెలిబుచ్చిన ఆవేదన ఇది. రాజస్థాన్‌లో కోట నగరంలో నీట్ కోసం కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థి ఈ ప్రశ్న ఎందుకో సంధించాడో తెలుసా? పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక తాను ఉండే వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతూ అతడు అడిగిన ప్రశ్న ఇది. కోట నగరంలో తాజాగా ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటంతో విద్యార్థి లోకం వణికిపోతోంది. ర్యాంకుల సాధనే లక్ష్యంగా కోచింగ్ సెంటర్లు సాగిస్తున్న శిక్షణ పర్వంలో విద్యార్థులు సమిధలవుతున్న ఘటనలు నిత్యకృత్యం మారాయి. ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య కోట నగరంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు బిహార్‌కు చెందిన వారు కాగా, మరొకరది మధ్యప్రదేశ్. మృతులను అంకుష్ ఆనంద్ (18), ఉజ్వల్ కుమార్ (17), ప్రణవ్ వర్మ (17)గా గుర్తించారు. అంకుష్, ఉజ్వల్ బిహార్ రాష్ట్రానికి చెందిన వారు. సుపాల్ జిల్లా వాసి అయిన అంకుష్.. నీట్ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గయా జిల్లాకు చెందిన ఉజ్వల్.. జేఈఈ కోసం సిద్ధమవుతున్నాడు. కోట నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తల్వాండి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున వీరిద్దరూ తమ తమ గదుల్లో సీలింగ్ ఫ్యాన్లకు ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ప్రణవ్ వర్మ (17) అనే నీట్ శిక్షణ కోసం కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం అర్థరాత్రి విషం తీసుకుని అపస్మారక స్థితిలో పడివున్న ప్రణవ్ను ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఒత్తిడే చిత్తు చేసిందా? బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులు రెండేళ్ల నుంచి కోచింగ్ తీసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. అంకుష్, ఉజ్వల్ ఒకే సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారని జవహర్ నగర్ డీఎస్పీ అమర్ సింగ్ తెలిపారు. వీరిద్దరూ కొంత కాలంలోగా క్లాసులకు సరిగా హాజరుకావడం లేదని, దీంతో చదువుల్లో వెనుకబడి ఒత్తిడికి గురయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే వారి గదుల్లో ఎలాంటి సూసైడ్ నోట్స్ లభించలేదని చెప్పారు. ఉజ్వల్ సోదరి కూడా ఇదే ప్రాంతంలో బాలికల హాస్టల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటోందని వెల్లడించారు. కాగా, కోచింగ్ సెంటర్ల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నీట్, జేఈఈ కోచింగ్‌కు ప్రసిద్ధి గాంచిన కోట నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అత్యంత ఎక్కువ పోటీ ఉండే నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకే లక్ష్యంగా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు కోట నగరానికి వస్తుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరిన తర్వాత విద్యార్థులకు కఠినమైన షెడ్యూల్ మొదలవుతుంది. రోజుకు దాదాపు 15 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక గంట ఎక్కువసేపు నిద్రపోయినా విద్యార్థులు అపరాధ భావంతో కుమిలిపోయేలా కోచింగ్ సెంటర్ల వ్యవహార శైలి ఉంటుందట. అంతేకాదు గాలి- వెలుతురు సరిగా లేని ఇరుకు హాస్టల్స్, పెయింగ్ గెస్ట్ వసతి గృహాల్లో చదువుకోవాల్సి రావడం కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. కంటితుడుపు చర్యలు విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల కౌన్సెలింగ్ కోసం ఏర్పాటు చేసిన హాట్‌లైన్ కూడా ఆత్మహత్యలను నిరోధించలేకపోతోంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, మూడో నెలలకొసారి పేరెంట్-టీచర్ మీటింగ్.. ఆదివారం తప్పనిసరి సెలవు, సోమవారం ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని అధికార యంత్రాంగం విధించిన నిబంధనలు కాగితాలకే పరిమితం అయ్యాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కోచింగ్ సెంటర్ల నియంత్రణకు శాసన ముసాయిదాను సిద్ధం చేయడానికి 2016లో రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఏం చేసిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. కోచింగ్‌కు కేరాఫ్ కోట మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల శిక్షణకు కోట నగరం ప్రసిద్ధి చెందింది. ఎయిమ్స్, నీట్, జిప్మర్, జేఈఈ, జేఈఈ మెయిన్స్ శిక్షణ ఇచ్చేందుకు 300పైగా కోచింగ్ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. తమ కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కానీ వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తుంటారు. మిగతా వారు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఒత్తిడికి గురయ్యే వారిలో కొంతమంది శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. వరుస బలవర్మణాలతో విద్యార్థుల ఆత్మహత్యల కేంద్రంగా కోట సిటీ అప్రదిష్ట మూటగట్టుకుంటోంది. -
విద్యార్థులతో బయలుదేరిన రైలు
కోట: రాజస్థాన్‌లోని కోట నగరం నుంచి ప్రత్యేక రైళ్లలో విద్యార్థులను తరలింపు శుక్రవారం మొదలయింది. దాదాపు 1200 మంది విద్యార్థులతో కోట నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి ప్రత్యేక రైలు బయలు దేరింది. జార్ఖండ్ విజ్ఞప్తి మేరకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ ప్రత్యేక రైలుకు అనుమతిచ్చింది. లాక్డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులను తరలిస్తున్నట్టు కోట ఎస్పీ గౌరవ్ యాదవ్ ‘ఏఎన్ఐ’తో చెప్పారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని, ఈ రోజు ఒక రైలు మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరిందని తెలిపారు. ఐఐటీ కోచింగ్ సెంటర్ల నిలయమైన కోట నగరంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 250 బస్సుల్లో తమ విద్యార్థులను స్వస్థలాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు వంద బస్సుల్లో తమ విద్యార్థులను కోట నుంచి తీసుకొచ్చింది. కాగా, లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ప్రత్యేక రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నేడు అనుమతి మంజూరు చేసింది. దీంతో దాదాపు ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. (ప్రత్యేక రైళ్లు; మార్గదర్శకాలు ఇవే..) -
వారిని తీసుకురాలేం: సీఎం
పట్నా: రాజస్థాన్‌లోని కోట నగరంలో చిక్కుకున్న విద్యార్థులను వెనక్కి తీసుకురావడం కుదరదని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురాలేమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అంశాన్ని ఆయన ప్రస్తావించారు. (అయ్యో.. ఆమె చనిపోలేదు!) ‘కోట నగరం లోని కోచింగ్ సెంటర్లలో పెద్ద సంఖ్యలో బిహార్ విద్యార్థులు చిక్కుకుపోయారు. కొన్ని రాష్ట్రాలు తమ విద్యార్థులను తీసుకుతెచ్చుకున్నాయి. కేంద్రం విధించిన లాక్డౌన్ మార్గదర్శకాలను మొదటి నుంచి బిహార్ పాటిస్తోంది. లాన్‌డౌన్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం సడలించే వరకు విద్యార్థులను తీసుకురావడం సాధ్యం కాద’ని నితీశ్ కుమార్ తెలిపారు. అయితే కోటలో బిహార్ విద్యార్థులతో ఇతర ప్రాంతాలకు చెందిన వారూ చిక్కుకుపోయారని వెల్లడించారు. (కరోనా: పతంగులు ఎగరేయొద్దు) ఇతర రాష్ట్రాల్లో చిక్కుపోయిన బిహారీలను ఆదుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు చెప్పారు. ఇలా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన 15 లక్షల మంది ఖాతాల్లో వెయ్యి రూపాయల చొప్పున జమ చేసినట్టు తెలిపారు. కేంద్ర వైద్యారోగ్య వెల్లడించిన తాజా గణంకాల ప్రకారం బిహార్‌లో ఇప్పటివరకు 277 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. కోవిడ్-19 బారిన పడిన వారిలో 56 మంది కోలుకున్నారు. లాక్‌డౌన్‌లోనూ చేతివాటం చూపించాడు! -
రాజస్తాన్ సర్కారు దవాఖానాలో దారుణం
జైపూర్: రాజస్తాన్ రాష్ట్రం కోటా నగరంలోని జేకే లోన్ తల్లీ పిల్లల ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక్క డిసెంబర్ నెలలో ఇప్పటి వరకు 77 మంది శిశువులు మృత్యువాతపడ్డారు. ఆస్పత్రిలో అసౌకర్యాలు, పనిచేయని పరికరాల కారణంగానే వీరంతా మృతి చెందినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా ఆరోపించారు. ఇంత దారుణం జరిగినా ప్రభుత్వంలో చలనం లేదని, మంత్రులెవరూ ఆస్పత్రికి వెళ్లి సమీక్షించిన దాఖలాల్లేవని మండిపడ్డారు. అయితే, గడిచిన ఆరేళ్ల గణాంకాలతో పోలిస్తే ఇవే అతి తక్కువ మరణాలని ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ అంటున్నారు. ‘గతంలో ఇక్కడ ఏడాదికి 1,500 మంది శిశువులు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. ప్రతి రాష్ట్రంలో, ప్రతి ఆస్పత్రిలో రోజుకు కనీసం ఐదారుగురు పసివాళ్లు చనిపోతూనే ఉంటారు. ఇక్కడా అదే జరుగుతోంది. జేకే ఆస్పత్రిలో శిశు మరణాలను సీరియస్‌గా తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ను విధుల నుంచి తొలగించాం’ అని వివరించారు. కాగా, పసికందుల మృతిపై కోటా నియోజకవర్గ ఎంపీ, లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్ బిర్లా ఆందోళన వ్యక్తం చేశారు. తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. -
రైల్వే స్టేషన్లో బాంబుల బ్యాగులు
జైపూర్: రాజస్థాన్‌లో బాంబుల బ్యాగులు కలకలం సృష్టించాయి. కోటా సిటీలోని రైల్వే స్టేషన్‌లోని ఓ ప్లాట్‌ఫాంపై అనుమానాస్పదంగా రెండు బ్యాగులను గుర్తించారు. దీంతో వాటిని తనిఖీ చేయగా పేలుడు పదార్థాలు ఉన్నాయి. 'కోటా సిటీలోని రైల్వే ప్లాట్‌ఫాం నెంబర్ 1పై దొరికిన రెండు బ్యాగుల్లో 2.75కేజీల పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, డిటోనేటర్లు లభించాయి' అని అక్కడి పోలీసులు తెలిపారు. పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు రెండు వేర్వేరు బ్యాగుల్లో పెట్టినట్లు పోలీసులు చెప్పారు. మంగళవారం సాయంత్ర 4.30గంటల ప్రాంతంలో వీటిని గుర్తించినట్లు వెల్లడించారు. అయితే, ఆ పేలుడు పదార్థాలు ఎలాంటివి అనే విషయంలో వివరణ మాత్రం ఇవ్వలేదు. శరవేగంగా బాంబ్ స్క్వాడ్ టీం స్పందించడంతో ఎలాంటి ప్రమాద ఘటన చోటుచేసుకోలేదు. ఢిల్లీ, ముంబయి వంటి సుదూర ప్రయాణాలు చేసేందుకు రాజస్థాన్‌లో ఇదే ప్రముఖ రైల్వే స్టేషన్.