రెండు ఆత్మహత్యలు.. మేమిక్కడ ఎందుకు ఉండాలి? | Rajasthan: Three Students Die Allegedly by Suicide in Coaching Hub of Kota | Sakshi
Sakshi News home page

రెండు ఆత్మహత్యలు.. మేమిక్కడ ఎందుకు ఉండాలి?

Published Wed, Dec 14 2022 8:32 PM | Last Updated on Wed, Dec 14 2022 8:32 PM

Rajasthan: Three Students Die Allegedly by Suicide in Coaching Hub of Kota - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

ఇక్కడ రెండు ఆత్మహత్యలు జరిగాయి. మేము ఇక్కడ ఎందుకు ఉండాలి? - ఓ విద్యార్థి వెలిబుచ్చిన ఆవేదన ఇది. రాజస్థాన్‌లో కోట నగరంలో నీట్‌ కోసం కోచింగ్‌ తీసుకుంటున్న విద్యార్థి ఈ ప్రశ్న ఎందుకో సంధించాడో తెలుసా? పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక తాను ఉండే వసతి గృహంలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంతో అక్కడి నుంచి వెళ్లిపోతూ అతడు అడిగిన ప్రశ్న ఇది. కోట నగరంలో తాజాగా ముగ్గురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడటంతో విద్యార్థి లోకం వణికిపోతోంది. ర్యాంకుల సాధనే లక్ష్యంగా కోచింగ్‌ సెంటర్లు సాగిస్తున్న శిక్షణ పర్వంలో విద్యార్థులు సమిధలవుతున్న ఘటనలు నిత్యకృత్యం మారాయి.

ముగ్గురు విద్యార్థుల ఆత్మహత్య
కోట నగరంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ముగ్గురు విద్యార్థులు తాజాగా ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో ఇద్దరు బిహార్‌కు చెందిన వారు కాగా, మరొకరది మధ్యప్రదేశ్‌. మృతులను అంకుష్ ఆనంద్ (18), ఉజ్వల్ కుమార్ (17), ప్రణవ్ వర్మ (17)గా గుర్తించారు. 

అంకుష్‌, ఉజ్వల్‌ బిహార్‌ రాష్ట్రానికి చెందిన వారు. సుపాల్ జిల్లా వాసి అయిన అంకుష్‌.. నీట్‌ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. గయా జిల్లాకు చెందిన ఉజ్వల్.. జేఈఈ కోసం సిద్ధమవుతున్నాడు. కోట నగరంలోని జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న తల్వాండి ప్రాంతంలోని పేయింగ్ గెస్ట్ వసతి గృహంలో సోమవారం తెల్లవారుజామున వీరిద్దరూ తమ తమ గదుల్లో సీలింగ్ ఫ్యాన్‌లకు ఉరివేసుకుని కనిపించారని పోలీసులు తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ప్రణవ్ వర్మ (17) అనే నీట్ శిక్షణ కోసం కున్హారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక హాస్టల్‌లో ఉంటున్నాడు. ఆదివారం అర్థరాత్రి విషం తీసుకుని అపస్మారక స్థితిలో పడివున్న ప్రణవ్‌ను  ఆస్పత్రికి తరలించగా అతడు అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. 

ఒత్తిడే చిత్తు చేసిందా?
బలవన్మరణానికి పాల్పడిన ముగ్గురు విద్యార్థులు రెండేళ్ల నుంచి కోచింగ్‌ తీసుకుంటున్నట్టు పోలీసులు వెల్లడించారు. అంకుష్‌, ఉజ్వల్‌ ఒకే సంస్థలో శిక్షణ తీసుకుంటున్నారని జవహర్ నగర్ డీఎస్పీ అమర్‌ సింగ్‌ తెలిపారు. వీరిద్దరూ కొంత కాలంలోగా క్లాసులకు సరిగా హాజరుకావడం లేదని, దీంతో చదువుల్లో వెనుకబడి ఒత్తిడికి గురయినట్టు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. అయితే వారి గదుల్లో ఎలాంటి సూసైడ్ నోట్స్ లభించలేదని చెప్పారు. ఉజ్వల్ సోదరి కూడా ఇదే ప్రాంతంలో బాలికల హాస్టల్‌లో ఉంటూ కోచింగ్‌ తీసుకుంటోందని వెల్లడించారు. కాగా, కోచింగ్‌ సెంటర్ల ఒత్తిడి కారణంగానే విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. 

నీట్‌, జేఈఈ కోచింగ్‌కు ప్రసిద్ధి గాంచిన కోట నగరంలో ఈ ఏడాది ఇప్పటివరకు 14 మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. అత్యంత ఎక్కువ పోటీ ఉండే నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షల్లో ర్యాంకే లక్ష్యంగా దేశం నలుమూలల నుంచి విద్యార్థులు కోట నగరానికి వస్తుంటారు. కోచింగ్ సెంటర్లలో చేరిన తర్వాత విద్యార్థులకు కఠినమైన షెడ్యూల్‌ మొదలవుతుంది. రోజుకు దాదాపు 15 గంటల పాటు పుస్తకాలతో కుస్తీ పడుతుంటారు. ఒక గంట ఎక్కువసేపు నిద్రపోయినా విద్యార్థులు అపరాధ భావంతో కుమిలిపోయేలా కోచింగ్‌ సెంటర్ల వ్యవహార శైలి ఉంటుందట. అంతేకాదు గాలి- వెలుతురు సరిగా లేని ఇరుకు హాస్టల్స్‌, పెయింగ్‌ గెస్ట్‌ వసతి గృహాల్లో చదువుకోవాల్సి రావడం కూడా విద్యార్థులపై ఒత్తిడి పెంచుతోంది. 

కంటితుడుపు చర్యలు
విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్నా అధికార యంత్రాంగం సరైన చర్యలు చేపట్టడం లేదని విమర్శలు విన్పిస్తున్నాయి. ఒత్తిడిలో ఉన్న విద్యార్థుల కౌన్సెలింగ్‌ కోసం ఏర్పాటు చేసిన హాట్‌లైన్‌ కూడా ఆత్మహత్యలను నిరోధించలేకపోతోంది. విద్యార్థుల హాజరు పర్యవేక్షణ, మూడో నెలలకొసారి పేరెంట్‌-టీచర్‌ మీటింగ్‌.. ఆదివారం తప్పనిసరి సెలవు, సోమవారం ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని అధికార యంత్రాంగం విధించిన నిబంధనలు కాగితాలకే పరిమితం అయ్యాయన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. కోచింగ్‌ సెంటర్ల నియంత్రణకు శాసన ముసాయిదాను సిద్ధం చేయడానికి 2016లో రాజస్థాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి కమిటీ ఏం చేసిందనే దానిపై ఇప్పటివరకు ఎటువంటి సమాచారం లేదు. 

కోచింగ్‌కు కేరాఫ్‌ కోట
మెడికల్, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల శిక్షణకు కోట నగరం ప్రసిద్ధి చెందింది. ఎయిమ్స్‌, నీట్‌, జిప్‌మర్‌, జేఈఈ, జేఈఈ మెయిన్స్‌ శిక్షణ ఇచ్చేందుకు 300పైగా కోచింగ్‌ సెంటర్లు ఇక్కడ ఉన్నాయి. తమ కలను నెరవేర్చుకోవాలనే ఆశతో ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా విద్యార్థులు ఇక్కడికి వస్తుంటారు. కానీ వీరిలో చాలా తక్కువ మంది మాత్రమే విజయం సాధిస్తుంటారు. మిగతా వారు ఇంటికి తిరిగి వెళ్లిపోతారు. ఒత్తిడికి గురయ్యే వారిలో కొంతమంది శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. వరుస బలవర్మణాలతో విద్యార్థుల ఆత్మహత్యల కేంద్రంగా కోట సిటీ అప్రదిష్ట మూటగట్టుకుంటోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement