కోట: రాజస్థాన్‌లోని కోట నగరం నుంచి ప్రత్యేక రైళ్లలో విద్యార్థులను తరలింపు శుక్రవారం మొదలయింది. దాదాపు 1200 మంది విద్యార్థులతో కోట నుంచి జార్ఖండ్ రాజధాని రాంచీకి ప్రత్యేక రైలు బయలు దేరింది. జార్ఖండ్ విజ్ఞప్తి మేరకు రాజస్థాన్ ప్రభుత్వం ఈ ప్రత్యేక రైలుకు అనుమతిచ్చింది. లాక్‌డౌన్ మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యార్థులను తరలిస్తున్నట్టు కోట ఎస్పీ గౌరవ్ యాదవ్ ‘ఏఎన్‌ఐ’తో చెప్పారు. భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకున్నామని, ఈ రోజు ఒక రైలు మాత్రమే ఇక్కడ నుంచి బయలుదేరిందని తెలిపారు.
ఐఐటీ కోచింగ్ సెంటర్ల నిలయమైన కోట నగరంలో పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చిక్కుకుపోయారు. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాదాపు 250 బస్సుల్లో తమ విద్యార్థులను స్వస్థలాలకు తరలించింది. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాదాపు వంద బస్సుల్లో తమ విద్యార్థులను కోట నుంచి తీసుకొచ్చింది. కాగా, లాక్‌డౌన్‌తో వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న కార్మికులు, విద్యార్థులు, టూరిస్టులు ప్రత్యేక రైళ్లలో తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం నేడు అనుమతి మంజూరు చేసింది. దీంతో దాదాపు ‘శ్రామిక్ స్పెషల్’ రైళ్లు పట్టాలు ఎక్కనున్నాయి. (ప్రత్యేక రైళ్లు; మార్గదర్శకాలు ఇవే..)
Comments
Please login to add a commentAdd a comment