Ashish Sharma Becomes Farmer: మహమ్మారి కరోనా ఒక విధంగా తనకు మంచే చేసిందని, ప్రకృతి ఒడికి చేరే అవకాశమిచ్చిందని బాలీవుడ్ నటుడు ఆశిష్ శర్మ అన్నాడు. ముంబై బిజీ లైఫ్ నుంచి విశ్రాంతి దొరికిందని, రైతుగా ఆహ్లాదకరమైన జీవితం గడుపుతున్నట్లు వెల్లడించాడు. ‘సియా కే రామ్’ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన ఆశిష్.. ‘‘మోదీ: జర్నీ ఆఫ్ కామన్ మ్యాన్’’ వెబ్‌సిరీస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ కిశోర(యవ్వన దశ) పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. కరోనా నేపథ్యంలో స్వస్థలం రాజస్తాన్‌కు చేరుకున్న అతడు.. ప్రస్తుతం రైతుగా మారాడు. పచ్చని ప్రకృతిలో సేద దీరుతున్నాడు.
ఈ విషయం గురించి ఆశిష్ శర్మ మాట్లాడుతూ... ‘‘ జీవితంలోని చిన్న చిన్న సంతోషాలను ఆస్వాదించడం మనం ఎప్పుడో మర్చిపోయాం. నిజానికి కోవిడ్ మూలంగానే మన జీవితంలో అతి ముఖ్యమైనవి ఏమిటో తెలిసివచ్చింది. ప్రకృతి విలువ, అందులోని మాధుర్యం గురించి అర్థం చేసుకోగలిగాను. తరతరాలుగా మా వృత్తి వ్యవసాయం. ముంబైకి వచ్చాక నేను నా మూలాలకు దూరమయ్యాను. లాక్‌డౌన్ సమయంలో మా ఊరు ఎంతగానో గుర్తుకువచ్చింది. ఊళ్లో మాకు 40 ఎకరాల భూమి ఉంది. 40 ఆవులు ఉన్నాయి.
ప్రకృతి తల్లితో మమేకమవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే తిరిగి వచ్చాను’’ అని చెప్పుకొచ్చాడు. ఇక జైపూర్‌లోని తమ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఆశిష్ శర్మ.. గోమాత గొప్పతనాన్ని మాటల్లో వర్ణించలేమని, తాను ఇప్పుడు పాలు పితకడం కూడా నేర్చుకున్నానని పేర్కొన్నాడు. కాగా లవ్ సెక్స్ ఔర్ ధోఖా, జిందగీ తేరేనామ్ వంటి సినిమాల్లో నటించిన ఆశిష్ శర్మ.. రంగ్‌రసియా సీరియల్‌తో బుల్లితెరపై స్టార్‌గా గుర్తింపు పొందాడు. ప్రస్తుతం అతడు... కరణ్ రాజ్‌దాన్ ‘హిందుత్వ’ ప్రాజెక్టులో కనిపించనున్నాడు. ఇక వ్యక్తిగత విషయానికొస్తే.. 2013లో నటి అర్చన తడేను అతడు వివాహమాడాడు.
Comments
Please login to add a commentAdd a comment