పానిపట్ : సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన సాక్షి మహేందర్ చావ్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. చండీగఢ్, పానిపట్టు జిల్లా సానౌలి గ్రామంలో మహేందర్ ఇంటి దగ్గర దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. దీంతో తీవ్రంగా గాయపడిన అతడ్ని ఆసుపత్రికి తరలించారు. వెన్నులో రెండు బుల్లెట్లు దిగాయని, ప్రస్తుతం చావ్లా పరిస్థితి ప్రమాదకరంగా ఉందని పోలీసులు తెలిపారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సూరత్ అత్యాచారం కేసులో ప్రధాన నిందితుడు, ఆశారాం బాపు కుమారుడు, నారాయణ సాయికి గత రెండు వారాల క్రితమే గుజరాత్ హైకోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఈ కాల్పులపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు వివిధ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయని, దుండగులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.
2001- 2005 మధ్య కాలంలో ఆశారాం బాపు కుమారుడు నారాయణసాయి తనపై పలు సార్లు అత్యాచారం చేశాడని ఓ మహిళ గుజరాత్లోని సూరత్ నగరంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే 2000 సంవత్సరంలో ఆశారాం బాపు ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న తమపై బాపు, ఆయన కుమారుడు నారాయణ సాయి అత్యాచారం చేశారని గుజరాత్కు చెందిన ఇద్దరు అక్కచెల్లెళ్లు పోలీసు స్టేషన్లలో వేర్వేరుగా ఫిర్యాదుచేశారు. ఈ నేపథ్యంలో గుజరాత్, పంజాబ్, ఢిల్లీ పోలీసుల సంయుక్తంగా గాలింపు చర్యల్లో భాగంగా నారాయణ సాయిని, ఆశారాం బాపును అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
ఆశారాం కేసులో ప్రధాన సాక్షిపై కాల్పులు
Published Wed, May 13 2015 4:19 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement