ఇంటర్నెట్ ప్రాథమిక హక్కు కావాలి...
భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు
ఇంటర్నెట్ విస్తృతికి ప్రభుత్వంతో కలసి పనిచేస్తాం
ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌పై దృష్టి ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్
భారత్‌లో తొలిసారి పర్యటన నేడు ప్రధాని నరేంద్ర మోదీతో భే టీ
న్యూఢిల్లీ: భారత్‌లో వ్యాపార వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని సోషల్ నెట్‌వర్కింగ్ సైట్ ఫేస్‌బుక్ సహ వ్యవస్థాపకుడు మార్క్ జకర్‌బర్గ్ వ్యాఖ్యానించారు. గ్రామగ్రామానికీ ఇంటర్నెట్‌ను విస్తరించే దిశగా ప్రభుత్వం తలపెట్టిన ప్రతిష్టాత్మక డిజిటల్ ఇండియా కార్యక్రమంలో తమ వంతు తోడ్పాటు అందించాలని ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అలాగే, ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ను మరింత ప్రోత్సహించనున్నట్లు వివరించారు.
తొలిసారిగా భారత పర్యటనకు వచ్చిన జకర్‌బర్గ్.. గురువారం ఇక్కడ జరిగిన ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాలు తెలిపారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో కూడా భేటీ కానున్నారు. గత కొద్ది రోజులుగా భారత పర్యటనకు వచ్చిన అమెరికా దిగ్గజ కంపెనీల సీఈవోల్లో జకర్‌బర్గ్ మూడోవారు. ఇటీవలే సాఫ్ట్‌వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, ఆన్‌లైన్ షాపింగ్ సంస్థ అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ భారత్ సందర్శించిన సంగతి తెలిసిందే.
ఇంటర్నెట్ కనెక్టివిటీ మరింత పెరగాలి.....
ప్రస్తుతం భారత్‌లో 24.3 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్లుండగా.. 10 కోట్ల పైచిలుకు ఫేస్‌బుక్ యూజర్లు ఉన్నారని అయితే ఇంకా దేశంలో వంద కోట్ల మంది ప్రజలకు ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదని జకర్‌బర్గ్ చెప్పారు. ఈ నేపథ్యంలో ఇంటర్నెట్ కనెక్టివిటీని ప్రాథమిక హక్కుల్లో ఒకటిగా పరిగణించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘అపరిమితమైన సామర్థ్యం గల అద్భుతమైన దేశం భారత్. అత్యుత్తమ ఆశయాలకు ఇది నెలవు. మేం కూడా ఎదిగేందుకు ఇక్కడ అపార అవకాశాలు ఉన్నాయి. అలాగే దేశాభివృద్ధికి తమ వంతు తోడ్పాటు అందించడానికి ఫేస్‌బుక్ కట్టుబడి ఉంది. గ్రామాలన్నింటినీ ఆన్‌లైన్‌తో అనుసంధానించేందుకు ప్రధాని కృషి చేస్తున్నారు. ఈ విషయంలో మేం అందించగలిగే సహకారాన్ని గురించి ఆయనతో చర్చించనున్నాను’ అని జకర్‌బర్గ్ తెలిపారు.
ప్రాంతీయ భాషల్లో యాప్స్ కోసం ఫండ్..
2007 నుంచి తమ సంస్థ ప్రాంతీయ భాషల్లో కొత్త యాప్స్, సర్వీసులు అందించడానికి కసరత్తు చేస్తోందని జకర్‌బర్గ్ తెలిపారు. ఫేస్‌బుక్ యూజర్లలో దాదాపు 65 శాతం మంది ఇంగ్లిష్ కాకుండా ఇతర భాషలే ఉపయోగిస్తున్నారని, ఇందులో 10 భారతీయ భాషలు కూడా ఉన్నాయని చెప్పారు. అయితే, ఇంకా తగినంత స్థాయిలో ప్రాంతీయ భాషల్లో కంటెంట్ లేకపోవడమే.. దాదాపు 440 కోట్ల మంది నెట్‌కి ఇప్పటికీ చేరువ కాకపోవడానికి ప్రధాన అడ్డంకిగా ఆయన అభివర్ణించారు. ఈ నేపథ్యంలోనే రైతులు, మహిళలు, వలసదారులకు ఉపయోగపడే యాప్స్‌ను రూపొందించే డెవలపర్ల కోసం 1 మిలియన్ డాలర్లతో ఫేస్‌బుక్ ఫండ్‌ను ఏర్పాటు చేస్తోందని ఆయన చెప్పా రు.
ప్రాంతీయ భాషల్లో యాప్స్, సర్వీసులను అందించడాన్ని ప్రోత్సహించేందుకు దీన్ని ఉద్దేశించినట్లు జకర్‌బర్గ్ చెప్పారు. ఇంటర్నెట్ అనేది సంపన్న వర్గాలకు మాత్రమే సంబంధించినది కాదని, అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే పరిశ్రమ వర్గాలు కలసి ఇంటర్నెట్‌డాట్‌ఆర్గ్‌కు రూపకల్పన చేశాయని జకర్‌బర్గ్ పేర్కొన్నారు. సామ్‌సంగ్, నోకియా, ఎరిక్సన్, క్వాల్‌కామ్, మీడియాటెక్, ఒపెరా తదితర సంస్థలు ఇందులో భాగస్వాములుగా ఉన్నాయన్నారు. అత్యాధునిక స్మార్ట్‌ఫోన్లను అత్యంత చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. ఎయిర్‌టెల్‌తో కలసి జాంబియాలో ఉచితంగా ప్రాథమిక ఇంటర్నెట్ సదుపాయం కల్పించేందుకు ఫేస్‌బుక్ కృషి చేస్తోందని చెప్పారు.
వాట్స్‌యాప్ ఆదాయాలపై ఇప్పుడే దృష్టి పెట్టడంలేదు...
ఇటీవలే దాదాపు 22 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన మెసేజింగ్ సర్వీసుల సంస్థ వాట్స్‌యాప్‌ను మరింత మందికి చేరువ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని జకర్‌బర్గ్ చెప్పారు. దీన్నుంచి భారీ ఆదాయాలను ఆర్జించే యోచనేదీ సమీప భవిష్యత్తులో లేదని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ప్రతి నెలా 60 కోట్ల మంది పైచిలుకు యూజర్లు వాట్స్‌యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
మార్స్ మిషన్‌కి కితాబు..
అంగారక గ్రహానికి భారత్ పంపిన మార్స్ ఆర్బిటర్ మిషన్ విజయవంతం కావడాన్ని జకర్‌బర్గ్ ప్రశంసించారు. ‘సాంకేతికంగా పురోగమించడంలో భారత్ ఎప్పుడూ సత్తా చాటుతూనే ఉంది. టెక్నాలజీ ప్రయోజనాలను అందరూ పంచుకుంటేనే సమాజం ముందడుగేస్తుంది. విజ్ఞానశాస్త్రాన్ని ఔపోసన పట్టిన భారత్‌ను ప్రపంచంలో సమున్నత స్థానంలో నిలిపేందుకు, అన్ని దేశాల దృష్టిని భారత్‌వైపు మళ్లించేందుకు తర్వాతి తరం యువత ఎదుట చక్కని అవకాశం ఉంది. ఇక్కడి ప్రజల్లో అత్యధికులు ఆన్‌లైన్‌ను వినియోగించుకోకపోవడం వల్ల ప్రపంచానికి అత్యద్భుతమైన, సృజనాత్మకమైన ఐడియాలు అందకుండా పోతున్నాయి’ అని పేర్కొన్నారు.