సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లాలో తన దివంగత భార్య జ్ఞాపకార్థం ఓ చిన్న తాజ్‌మహల్‌ను నిర్మించిన అభినవ షాజహాన్, ఫైజుల్ హాసన్ ఖద్రీ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం మరణించారు. గురువారం నాడు కేసర్ కలాన్‌లో జరిగిన ఓ హిట్ రన్ రోడ్డు ప్రమాదం కేసులో ఫైజుల్ గాయపడ్డారని, ఆయన్ని ఆస్పత్రిలో చేర్చగా శుక్రవారం మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. ఆయనకు 83 ఏళ్లు.
పోస్ట్‌మాస్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఫైజుల్ హాసన్ తన భార్య జ్ఞాపకార్థం 2012లో తన సొంత స్థలంలో మినీ తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. బేసిక్ స్ట్రక్చర్ నిర్మాణానికే తన పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులు, అప్పటి వరకు తాను దాచుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. దాంతో నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయం తెలిసిన అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆయన్ని పిలిపించి, నిర్మాణం పూర్తికి కావాల్సిన డబ్బును తాను ఇస్తానని, నిర్మాణాన్ని కొనసాగించాల్సిందిగా ఫైజుల్‌కు చెప్పారు.
ఆ ప్రతిపాదనను ఫైజుల్ సున్నితంగా తిరస్కరించారు. తన సొంత డబ్బులతోని దాన్ని పూర్తి చేస్తే తనకు సంతృప్తి అని అన్నారు. అంతేకాకుండా తనకు ఇస్తానన్న డబ్బులను వెచ్చించి తన ఊరులో బాలికల జూనియర్ కళాశాల కట్టివ్వాల్సిందిగా కోరారు. కాలేజీ కోసం ఆ వృద్ధుడు తనకున్న కొంత స్థలాన్ని కూడా విరాళంగా ఇచ్చారు. ఆ వృద్ధుడి కోరిక మేరకు అఖిలేష్ యాదవ్ బాలికల కోసం కాలేజీ నిర్మించారు. జైపూర్‌కు వెళ్లి మార్బుల్ కొనేందుకు ఫైజుల్ గత కొంత కాలంగా డబ్బులు దాచుకుంటూ వచ్చారని, అవి దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటాయని మార్బుల్‌ను కొనే ప్రయత్నంలో ఉండగానే రోడ్డు ప్రమాదం జరిగి పోయిందని ఆయన బంధువులు తెలిపారు. ఫైజుల్ 1954లో తాజా ముల్లీ బీబీని పెళ్లి చేసుకున్నారని, మినీ తాజ్ మహల్‌లో ఆమె సమాధి పక్కనే ఇప్పుడు ఫైజుల్ సమాధిని నిర్మిస్తామని బంధువులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment