Mini Taj Mahal
-
నాన్నలాంటి అమ్మకు ప్రేమతో... తాజ్‌మహల్
చెన్నైకి చెందిన అమృద్దీన్ షేక్ దావూద్ తన తల్లి జ్ఞాపకార్థం తిరువూరుకు సమీపంలో కోట్లు వెచ్చించి మినీ తాజ్‌మహల్ నిర్మించాడు. ఈ నిర్మాణం కోసం రాజస్థాన్ నుంచి మార్బుల్స్ తెప్పించాడు. ఈ ‘మినీ తాజ్‌మహల్’ నిర్మాణానికి రెండు సంవత్సరాలు పట్టింది. తండ్రి చనిపోయినప్పుడు అమృద్దీన్ వయసు 11 సంవత్సరాలు. నలుగురు కూతుళ్లు, కొడుకుకు ఏ చిన్న కష్టం రాకుండా తానే తల్లీదండ్రీ అయింది అమ్మ. తల్లి చనిపోయిన రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు అమృద్దీన్. ఈ మినీ తాజ్‌మహల్ ఇమేజ్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘ఈ తాజ్‌మహల్‌లో అణువణువునా తల్లిపై ప్రేమ కనిపిస్తుంది’ అంటూ నెటిజనులు స్పందించారు. -
‘దక్కన్ తాజ్ మహల్’ ఎవరు కట్టించారో తెలుసా?!
తాజ్ మహల్లాగానే అనిపిస్తుంది. ఇది ఆగ్రా కాదు. చూస్తున్నది తాజ్ మహలూ కాదు. తాజ్‌మహల్ లాంటిదే కట్టాలన్న ఓ ప్రయత్నం.పేరు బీబీ కా మఖ్బారా. ఔరంగాబాద్‌లో ఉంది. అందుకే దక్కన్ తాజ్‌గా వాడుకలోకి వచ్చింది. బీబీ కా మఖ్బారాలో తాజ్ మహల్లో ఉండే తేజం కనిపించదు, కానీ నిర్మాణ నైపుణ్యంలో తాజ్‌మహల్‌కు ఏ మాత్రం తీసిపోదు. ఔరంగజేబు భార్య దిల్రాస్ బానుబేగమ్ సమాధి నిర్మాణం ఇది. బాను బేగమ్ కొడుకు అజమ్ షా దగ్గరుండి కట్టించాడు. మొఘల్ ఆర్కిటెక్చర్ శైలిని ప్రతిబింబిస్తుంది, ప్రధాన భవనం ముందు పెద్ద కొలను, నాలుగు వైపులా విశాలమైన చార్బాగ్ కాన్సెప్ట్ తోటలు, పాలరాతి పూలలో పర్షియన్ లాలిత్యం ప్రతిదీ తాజ్‌మహల్‌ను పోలి ఉంటుంది. తలెత్తి ఓసారి పై కప్పును చూస్తే ఇక ఒక నిమిషం పాటు తల దించుకోలేం. తోటల నుంచి స్వచ్ఛమైన గాలి ధారాళంగా ప్రసరిస్తూ ఉన్న విశాలమైన వరండాలు, ఆర్చ్‌ల మధ్య తిరుగుతుంటే ఆహ్లాదంగా ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ ఇక్కడే బీబీ కా మఖ్బారా... మహారాష్ట్ర, ఔరంగాబాద్ పట్టణానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఔరంగజేబు దక్కన్ కోసం పోరాడి పోరాడి దక్కన్‌లోనే మరణించాడు. బీబీ కా మఖ్బారాకు నలభై కిలోమీటర్ల దూరంలో ఖుల్దాబాద్‌లో అతడి సమాధి ఉంది. ఈ ట్రిప్‌లో శివాజీ మ్యూజియాన్ని కలుపుకోవచ్చు. ఆ మ్యూజియంలో శివాజీ ఆయుధాలు, నాణేల ప్రదర్శన ఆసక్తిగా ఉంటుంది. ఇవి కూడా చూడవచ్చు! 16 కిమీల దూరంలో దౌలతాబాద్ కోట 30 కి.మీల దూరంలో ఎల్లోరా గుహలు 50 కి.మీల దూరంలో పైథాన్ ఉంది. అక్కడి చేనేతకారులు నేసే చీరలను పైథానీ చీరలంటారు. మహిళల మనసు దోచే పైథానీ చీరలు గత దశాబ్దకాలంగా నడుస్తున్న ట్రెండ్. కాబట్టి ఒక్క చీరనైనా తెచ్చుకుంటే ఈ ట్రిప్‌కు గుర్తుగా ఉంటుంది. ధర పదివేల నుంచి మొదలవుతుంది. బస: ఔరంగాబాద్‌లో బస చేయవచ్చు. ఉత్తరాది, దక్షిణాది ఆహారం దొరుకుతుంది. – వాకా మంజులారెడ్డి చదవండి: పాపికొండలు.. బెంగాల్ పులులు.. బంగారు బల్లులు -
మినీ తాజ్‌మహల్ నిర్మాత దుర్మరణం
సాక్షి, న్యూఢిల్లీ : ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షెహర్ జిల్లాలో తన దివంగత భార్య జ్ఞాపకార్థం ఓ చిన్న తాజ్‌మహల్‌ను నిర్మించిన అభినవ షాజహాన్, ఫైజుల్ హాసన్ ఖద్రీ ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం మరణించారు. గురువారం నాడు కేసర్ కలాన్‌లో జరిగిన ఓ హిట్ రన్ రోడ్డు ప్రమాదం కేసులో ఫైజుల్ గాయపడ్డారని, ఆయన్ని ఆస్పత్రిలో చేర్చగా శుక్రవారం మరణించారని పోలీసులు శనివారం తెలిపారు. ఆయనకు 83 ఏళ్లు. పోస్ట్‌మాస్టర్‌గా ప్రభుత్వ ఉద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఫైజుల్ హాసన్ తన భార్య జ్ఞాపకార్థం 2012లో తన సొంత స్థలంలో మినీ తాజ్ మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు. బేసిక్ స్ట్రక్చర్ నిర్మాణానికే తన పదవీ విరమణ సందర్భంగా వచ్చిన డబ్బులు, అప్పటి వరకు తాను దాచుకున్న డబ్బులు ఖర్చయిపోయాయి. దాంతో నిర్మాణం ఆగిపోయింది. ఈ విషయం తెలిసిన అప్పటి యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆయన్ని పిలిపించి, నిర్మాణం పూర్తికి కావాల్సిన డబ్బును తాను ఇస్తానని, నిర్మాణాన్ని కొనసాగించాల్సిందిగా ఫైజుల్కు చెప్పారు. ఆ ప్రతిపాదనను ఫైజుల్ సున్నితంగా తిరస్కరించారు. తన సొంత డబ్బులతోని దాన్ని పూర్తి చేస్తే తనకు సంతృప్తి అని అన్నారు. అంతేకాకుండా తనకు ఇస్తానన్న డబ్బులను వెచ్చించి తన ఊరులో బాలికల జూనియర్ కళాశాల కట్టివ్వాల్సిందిగా కోరారు. కాలేజీ కోసం ఆ వృద్ధుడు తనకున్న కొంత స్థలాన్ని కూడా విరాళంగా ఇచ్చారు. ఆ వృద్ధుడి కోరిక మేరకు అఖిలేష్ యాదవ్ బాలికల కోసం కాలేజీ నిర్మించారు. జైపూర్‌కు వెళ్లి మార్బుల్ కొనేందుకు ఫైజుల్ గత కొంత కాలంగా డబ్బులు దాచుకుంటూ వచ్చారని, అవి దాదాపు రెండు లక్షల రూపాయలు ఉంటాయని మార్బుల్‌ను కొనే ప్రయత్నంలో ఉండగానే రోడ్డు ప్రమాదం జరిగి పోయిందని ఆయన బంధువులు తెలిపారు. ఫైజుల్ 1954లో తాజా ముల్లీ బీబీని పెళ్లి చేసుకున్నారని, మినీ తాజ్ మహల్లో ఆమె సమాధి పక్కనే ఇప్పుడు ఫైజుల్ సమాధిని నిర్మిస్తామని బంధువులు తెలిపారు.